రొమ్ము విరుచుకుని చెబుతున్నా.. నేను గర్వపడుతున్నా.. అని కామెంట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ). 34 ఏళ్ల క్రితం తాను అనుభవించిన బాధ ఇప్పుడు తీరిపోయిందన్నారు. ఇంతకీ మెగాస్టార్‌ను బాధించిన ఉదంతం ఏంటంటే..? చిరు ఎందుకంత ఎమోషనల్ అయ్యారంటే.. ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకలో 34 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఒకప్పుడు దక్షిణాది సినిమాలను బాలీవుడ్ ఎంత చిన్నచూపు చూసిందో వెల్లడించారు. ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమా అని భ్రమించేలా అప్పటి బాలీవుడ్ సినీ పెద్దలు వ్యవహరించారని నాటి సంఘటనను గుర్తు చేశారు చిరంజీవి. 1988లో విడుదలైన రుద్రవీణ సినిమాకు జాతీయ స్థాయిలో నర్గీస్‌దత్ అవార్డ్ వస్తే, పురస్కారాన్ని తీసుకోవడానికి ముంబై వెళ్లామని, అయితే అక్కడ ఇండియన్ సినిమా వైభవానికి సంబంధించి ఓ గోడ మీద వేసిన ప్రదర్శనలో సౌత్ ఇండియా నుంచి అతి కొద్ది మందికి మాత్రమే స్థానం లభించిందన్నారు. అయితే సౌత్ ఇండియాలో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, శివాజీ గణేశన్, ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి గొప్ప నటులకు కూడా అక్కడి ప్రదర్శనలో స్థానం లభించక పోవడం బాధించిందన్నారు చిరంజీవి. దీన్ని తాను అవమానంగా భావించానన్నారు చిరంజీవి.
అయితే ఇన్నేళ్ల తర్వాత తాను గర్వపడేలా, రొమ్ము విరుచుకునేలా చేసింది దర్శకుడు రాజమౌళి అని చెప్పారు చిరంజీవి. బాహుబలి, త్రిపులార్ సినిమాల ద్వారా ఒక్క ఇండియాలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో టాలీవుడ్ సినిమా సత్తాను చాటి చెప్పారని పొగడ్తలతో ముంచెత్తారు. ఇండియన్ సినిమా అనేది ఒక మతం అయితే దానికి మఠాధిపతి రాజమౌళి అంటూ సంభోదించారు చిరంజీవి. అలాంటి దర్శకధీరుడు రాజమౌళిని సన్మానించుకోవాల్సిన అవసరం ఉందన్నారు చిరంజీవి. మొత్తం మీద బాలీవుడ్ సినీ పెద్దలు 34 ఏళ్ల క్రితం చేసిన గాయానికి రాజమౌళి రూపంలో మందు లభించిందన్నారు చిరంజీవి. ఇప్పుడు టాలీవుడ్ సినిమాకు ఎల్లలు లేవని, అంతర్జాతీయ స్థాయిలో బాలీవుడ్ సినిమాలను మించి సత్తా చాటుతున్నాయన్నారు చిరంజీవి.
మరిన్ని ఇక్కడ చదవండి :