‘మెగా’ వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. నటుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ (36), హీరోయిన్ లావణ్య త్రిపాటి (32) పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ గత కొంతకాలంగా పలు పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంత వరకు వీరిరువురు స్పందించింది లేదు. ఇప్పుడు ఏకంగా త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇరువురి కుటుంబాలకు చెందిన పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి ఎంగేజ్‌మెంట్ ఈ నెల 9న హైదరాబాద్‌లో జరగనుందని డేట్ కూడా ఫిక్స్ చేశారు.
ఐతే సోషల్ మీడియాలో ఇంత హడావుడి జరుగుతున్నా.. మెగా ఫ్యామిలీ మాత్రం ఎందుకో పెదవి విప్పడం లేదు. దీంతో ఈ వార్తల్లో నిజమెంతో తెలీక అభిమానులు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇరు వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడమే సస్పెన్స్‌కు ప్రధాన కారణం.
గాసిప్స్‌పై ఇన్నాళ్లు పరోక్షంగా ఖండిస్తూ వచ్చినా ఇప్పుడు మాత్రం వాళ్ల నుంచి కానీ, వాళ్ల ప్రతినిధుల నుంచి కానీ ఎలాంటి ఖండన లేకపోవడంతో నిశ్చితార్థం ఖాయం అని నెటిజన్లు ఓ నిర్ణయినికి వచ్చేస్తున్నారు. మరోవైపు వరుణ్ తేజ్ ప్రస్తుతం రోమ్, ఇటలీ వెకేషన్‌లో ఉన్నాడు. ఇక లావణ్య త్రిపాఠి సినిమా షూట్‌లలో బిజీబిజీగా ఉంది. వరుణ్ తేజ్-లావణ్య తొలిసారి ‘మిస్టర్’ మువీలో, ఆ తర్వాత ‘అంతరిక్షం’లో జోడీ కట్టారు. సినిమా షూట్ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించిందని, ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నట్లు నెటిజన్లు కథలు అల్లుతున్నారు. ఏది నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ వేచి చేడవల్సిందే..!
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.