Mayabazar: వెండితెర అద్భుత దృశ్యకావ్యం.. తెలుగు సినిమా కీర్తికి మకుటం.. ఆరున్నర దశాబ్దాల మాయాబజార్‌

అసలు మాయాబజార్‌ గురించి ఎన్నిసార్లు ఎంతగా చెప్పుకున్నా ఏదో ఒకటి మిగిలిపోతూనే ఉంటుంది. మళ్లీ మళ్లీ ఆ చిత్రరాజం గురించి చెప్పుకోవాల్సి వస్తోంది.. వర్షానికి తడవని వారు, మాయాబజార్‌ చూడని వారు ఉభయరాష్ట్రాలలో చాలా తక్కువమందే ఉంటారన్నది వాస్తవం.

Mayabazar: వెండితెర అద్భుత దృశ్యకావ్యం.. తెలుగు సినిమా కీర్తికి మకుటం.. ఆరున్నర దశాబ్దాల మాయాబజార్‌
Mayabazar
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Mar 27, 2022 | 2:57 PM

ఓ సినిమా మన మనస్సులో మహా అయితే పదేళ్ల ఉంటుంది.. గొప్ప సినిమా అయితే ఓ ఇరవై ఏళ్ల ఉంటుంది.. కానీ ఆరున్నర దశాబ్దాలుగా ఒక తెలుగు సినిమా మన జీవన స్రవంతిలో భాగం కావడమన్నది ఓ అద్భుతం.. అపూర్వం.. అపురూపం.. అది విజయావారి మాయాబజార్‌.. ఆరున్నర దశాబ్దాల కిందట సరిగ్గా ఇదే రోజున విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ నిత్య నూతనంగా విరాజిల్లుతోంది. అప్పుడే విరిసిన మల్లియలా పరిమళాలను వెదజల్లుతోంది..తెలుగువారిలో ఏ విషయంలోనైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చేమోగానీ మాయాబజార్‌ విషయంలో మాత్రం అందరిదీ ఒకే అభిప్రాయం..తెలుగు సినిమా సాంకేతికంగా ఎంతగానో ఎదగవచ్చు.. బాక్సాఫీసును బద్దలు కొట్టవచ్చు.. కోట్లాది రూపాయలను కొల్లగొట్టవచ్చు.. అయినప్పటికీ మాయాబజార్‌ ముందు సాష్టాంగం పడవలసిందే! అంతెందుకు ఆ మధ్యన సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌ జరిపిన పోల్‌లో మన మాయాజజారే కదా అగ్రస్థానం సాధించినది! భారతీయ సినీ చరిత్రలో అత్యద్భుత దృశ్యకావ్యంగా నిలిచిపోయినందుకే కదా అంతటి ఘనకీర్తి!

అసలు మాయాబజార్‌ గురించి ఎన్నిసార్లు ఎంతగా చెప్పుకున్నా ఏదో ఒకటి మిగిలిపోతూనే ఉంటుంది. మళ్లీ మళ్లీ ఆ చిత్రరాజం గురించి చెప్పుకోవాల్సి వస్తోంది.. వర్షానికి తడవని వారు, మాయాబజార్‌ చూడని వారు ఉభయరాష్ట్రాలలో చాలా తక్కువమందే ఉంటారన్నది వాస్తవం. చూసినవారు ఒక్కసారికే మడికట్టుకు కూర్చొలేదు. అవును మరి! చూసిన కొద్దీ చూడాలనిపిస్తుందా సినిమా! అద్భుతానికి పర్యాయపదంగా చెప్పుకునే ఈ సినిమా గురించి తెలుగువారు ఇష్టంగా, అందంగా చెప్పుకునే అబద్ధం ఒకటి ఉంది. అదే మాయాబజార్‌ను నేను 50 సార్లు చూశాను. వందసార్లు చూశాను. 150 సార్లు చూశాను అని! నిజంగా అలా చెప్పేవాళ్లు అన్ని సార్లు చూశారో లేదో తెలియదు కానీ ఎంతో ఇష్టంగా చెప్పే అబద్ధం కూడా వినడానికి హాయిగా ఉంటుంది.. కారణం అన్ని సార్లు చూడాలనిపిస్తుంది కాబట్టి.. అసలా సినిమా పేరు చెబితేనే చాలు తెలుగువారు గర్వంగా ఫీలవుతారు. ఇది మా సంపద అని గొప్పగా చెప్పుకుంటారు.

అది దర్శకస్రష్ట కె.వి.రెడ్డి గొప్పతనమా? నటీనటుల ప్రతిభనా? సాహిత్యాన్ని అందించిన పింగళి నాగేంద్రరావు కల విన్యాసమా? మార్కస్‌ బార్‌ట్లే కెమెరా పనితనమా? ఏమో చెప్పలేం.. ఒక్కటి మాత్రం చెప్పగలం మాయాబజార్‌ అన్నది ఓ షడ్రోసోపేతమైన విందు! కె.వి.రెడ్డి అందించిన విందుభోజనం. సినిమా అంతా పాండవుల ప్రస్తావన ఉంటుంది కానీ వాళ్లు మాత్రం ఎక్కడా కనిపించదు.. అదే సినిమా చమత్కారం. కథా చర్చలప్పుడే ఎవరు ఏ పాత్ర వేయాలన్నది కె.వి. ఫిక్స్‌ చేసుకున్నారు. అలా అలనాటి ప్రధాన తారాగణమంతా వచ్చేశారు. ఇక పాండవులకు చోటేక్కడుంటుంది? అందుకే సినిమాలో పాండవులను చూపించలేకపోయారు. పాత్రధారుల ఎంపికలో కె.వి. చాలా జాగ్రత్త తీసుకునేవారు. రేవతి పాత్రకు ఛాయాదేవిని ఎంపిక చేసినప్పుడు కొంతమంది అదేమిటి? ఆవిడను తీసుకున్నారు? అని అడిగారట. దానికాయన.. సావిత్రి బొద్దుమనిషి. మరి ఆమె తల్లి ఇంకాస్తా లావుగా కనిపించాలి కదా అని అన్నారట. కె.వి.రెడ్డి స్క్రీన్‌ప్లే పకడ్బందీగా ఉండేది. నిర్దిష్టంగా ఉండేది. సాంకేతికాంశాలను అధ్యయనం చేసేవారికి మాయాబజార్‌ స్క్రీన్‌ప్లే ఒక వ్యాకరణం. ఓ కథను ఎలాంటి గందరగోళం లేకుండా సూటిగా ఎలా చెప్పవచ్చన్నదానికి ఇంతకు మించిన స్క్రీన్‌ప్లే ఉండదు. దర్శకుడికి స్క్రిప్టే ప్రధానం అన్నది కె.వి.రెడ్డి నిశ్చితాభిప్రాయం. స్క్రీన్‌ప్లే అన్న మాట కెవికి మాత్రమే చెందుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

నిజానికి నాగిరెడ్డి, చక్రపాణిలు ఈ సినిమా తీయడానికి చాలా కాలం తటపటాయించారు. అందుకు కారణం అంతకు ముందు భారీ బడ్జెట్‌తో తీసిన చంద్రహారం ఫ్లాప్‌ కావడమే! విజయావారికి పాతాళభైరవి వంటి సూపర్‌ డూపర్‌ హిట్టునిచ్చిన కేవీ తర్వాత అంతకు ముందే కమిట్‌ అయిన అన్నపూర్ణ వారికి దొంగరాముడు చేసి పెట్టారు. ఆ సినిమా ఘన విజయం సాధించింది. అటుపిమ్మట విజయావారికి కొత్త సినిమా పని మొదలు పెట్టారు కేవీ. ఈసారి పౌరాణికం తీద్దామనుకున్నారు. శశిరేఖా పరిణయం ఇతివృత్తం. అంతకు ముందు మాయాబజార్‌ అనబడు శశిరేఖా పరిణయం పేరుతో ఓ సినిమా వచ్చింది. ప్రేక్షకులను అమితంగా అలరించే అంశాలు ఆ కథలో ఉన్నాయి కాబట్టే కేవీ ఆ సబ్జెక్టును ఎంచుకున్నారు. ఏడాది పాటు అన్ని విషయాలను సేకరించారు. అందరితో చర్చించారు. సినిమా స్క్రిప్ట్‌ చాలా పకడ్బందీగా రాసుకున్నారు. ఈ సమయంలోనే నాగిరెడ్డి-చక్రపాణి సినిమా ఆపేయమంటున్నారని ప్రొడక్షన్‌ మేనేజర్‌ వచ్చి కేవీతో చెప్పాడు. సినిమా ఆగిపోయందన్న వార్త మద్రాస్‌ అంతటా వ్యాపించింది. అప్పట్లో విజయా తో పాటుగా భారీ చిత్రాలను నిర్మించే సంస్థలు ఏవీఎం, జెమిని మాత్రమే.. విషయం తెలుసుకున్న ఏవీఎం అధినేత మెయ్యప్పన్‌ వెంటనే విజయవాడలోని విజయా పిక్చర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ అధినేత పూర్ణచంద్రరావుకు కబురు పంపించారు. విజయావారు సినిమా తీయకపోతే తాము నిర్మిస్తామని, కేవీకి ఎంత పారితోషికం కావాలంటే అంతిస్తామని చెప్పారు. ఇది కేవీకి కూడా తెలిసింది. అయితే కోట్లు ఇచ్చినా ఇంకొకరికి తీసేది లేదని కేవీ గట్టిగా చెప్పేశారు. సుందర్‌లాల్‌ నహతా, కొందరు తమిళ సినిమా నిర్మాతల దగ్గర్నుంచి కూడా ఇలాంటి ప్రతిపాదనలే వచ్చాయి. ఇలా మాయాబజార్‌ కోసం చాలా సంస్థలు పోటీపడుతున్నాయన్న విషయం నాగిరెడ్డి-చక్రపాణిలకు తెలిసింది. వెంటనే సినిమాకు ఓకే చెప్పారు. అలా తెలుగు-తమిళ భాషలలో ఏకకాలంలో మాయాబజార్‌ షూటింగ్‌ ఆరంభమయ్యింది.

మాయాబజార్‌ సినిమాకు ముందు అనుకున్న పేరు శశిరేఖా పరిణయం. ఆ పేరుతోనే చివరి వరకు ప్రచారం జరిగింది. కానీ విడుదలకు కొద్ది రోజుల ముందు మాయాబజార్‌ అన్న పేరు ఖరారు చేశారు. నిజానికి బజార్‌ అన్నది తెలుగు పదం కాదు. అందుకే సినిమాలో ఎక్కడా ఆ పదం ప్రస్తావనకు రాదు. ఇక సినిమాకు సంగీత దర్శకుడిగా మొదట అనుకున్నది సాలూరి రాజేశ్వరరావును. మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా జరిగాయి. నీవేనా తనను తలచినది, చూపులు కలిసిన శుభవేళ, లాహిరి లాహరి లాహిరిలో, నీ కోసమే నే జీవించునది పాటలకు బాణిలు కట్టింది సాలూరి వారే! రికార్డింగ్‌ వరకు వెళ్లక ముందే రాజేశ్వరరావు తప్పుకున్నారు. అప్పుడు ఆ బాధ్యతలను ఘంటసాల తీసుకున్నారు. 30 లక్షల రూపాయల ఖర్చుతో తీసిన మాయాబజార్‌ సినిమా 1957, మార్చి 27న విడుదలయ్యింది. అన్ని చోట్లా ఘన విజయం సాధించింది. రోజుకు మూడు ఆటలు మాత్రమే ప్రదర్శితమయ్యే ఆ రోజుల్లో చాలా చోట్ల రోజుకు అయిదారు షోలు కూడా వేశారు. 24 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. విజయవాడ దుర్గకళామందిరంతో పాటు నాలుగు కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది. అప్పుడే కాదు ఆ తర్వాత ఎప్పుడు విడుదలైనా ప్రేక్షకులు అమితంగా ఆదరించారు. రంగులద్దుకున్న మాయాబజార్‌కు కూడా విజయాన్ని ఇచ్చారు.

Also Read: Viral Video: ‘ప‌ర‌మ్ సుంద‌రి’ పాట‌కు డాన్స్‌‌ చేసి పిచ్చెక్కించిన ఎయిర్‌హోస్టెస్.. సూపర్బ్ అంతే

ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
ఏపీ ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ 2024 పరీక్షల షెడ్యూల్‌
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు