
టాలీవుడ్ లో మరో విషాదం.. సూపర్ స్టార్ మహేష్ బాబుకు మాతృవియోగం కలిగింది. ఘట్టమనేని కృష్ణ సతీమణి, ఘట్టమనేని మహేష్ తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిసినప్పటి నుంచే ఘట్టమనేని వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇందిరాదేవిని ప్రాణంగా చూసుకునేవారు పిల్లలు… పద్మ, మంజుల, ఇందిర ప్రియదర్శిని, రమేష్ బాబు, మహేష్‌బాబు. ఇద్దరు కొడుకులు సినిమాల్లో ఉన్నా, ఏ రోజూ సినిమా వేడుకలకు హాజరు కావడానికి ఉత్సాహం చూపేవారు కాదు ఇందిరాదేవి. ఇందిరాదేవి పుట్టినరోజున, మదర్స్ డే రోజున, విమెన్స్ డే రోజున ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టి, తనకు తల్లి పట్ల ఉన్న మమకారాన్ని అభిమానులతో పంచుకునేవారు మహేష్. ఆ మధ్య విజయ్ నిర్మల, ఇటీవల రమేష్‌బాబు మృతితో దిగాలుచెందిన సూపర్‌స్టార్ కృష్ణకు… ఇప్పుడు ఇందిరాదేవి దూరం కావడం మరింత బాధాకరం.