Uday Kiran: అభిమానులను మోసం చేశావ్ ఉదయ్.. ఫీనిక్స్ ఫక్షిలా లేచి వస్తానని చెప్పి..
దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఇండియాగ్లిట్జ్‌తో గతంలో తన మనసులోని భావాలను పంచుకున్నారు. కెరీర్ లో ఎదుర్కొన్న సవాళ్లు, తమిళ సినిమాల అనుభవం, ఆడియన్స్ అంచనాల గురించి వివరించారు. ఎప్పుడూ వివరణలు ఇవ్వని ఉదయ్, మంచి వినోదభరితమైన కథల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

ఉదయ్ కిరణ్ గురించి చెప్పేది ఏముంది..? పక్కింటి అబ్బాయిలా అనిపించే రూపం.. ముఖంలో తెలియని అమాయకత్వం. అప్పట్లో వరుస లవ్ స్టోరీ హిట్స్ ఇచ్చిన ఉదయ్ అంటే అమ్మాయిలు పడి చనిపోయారు. కానీ ఆ తర్వాత కాలంలో అతను చేసిన సినిమాలు వరసగా పరాజయం అయ్యాయి. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడులకు లోనైన ఉదయ్.. ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని వీడారు. అప్పట్లో దిల్ కబడ్డీ మూవీ విడుదల సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఉదయ్.. తన మనసులోని భావాలను పంచుకున్నారు.
కెరీర్‌లో గ్యాప్స్ రావడానికి గల కారణాలను వివరిస్తూ, అదృష్టం కలిసి వచ్చి, అనుకూలమైన పరిస్థితులు ఉంటేనే మంచి కథలు వరుసగా వస్తాయని పేర్కొన్నారు. తన ప్రారంభ కెరీర్ లో మంచి కథలను ఎంపిక చేసుకునే అవకాశం లభించిందని, అది తన అదృష్టమని ఆయన గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు చిత్రం వంటి సంచలనాత్మక చిత్రాలతో తెలుగు సినిమాలో ఒక తరం యువతకు ఆరాధ్య తారగా వెలుగొందిన ఉదయ్ కిరణ్, టాలీవుడ్‌లో తదుపరి పెద్ద స్టార్‌గా పేరు పొందారు. కొన్ని పరాజయాలు, పుకార్లు తన కెరీర్‌ను ప్రభావితం చేశాయని వివరించారు. తమిళ సినీ పరిశ్రమలో తన అనుభవాల గురించి మాట్లాడుతూ, అక్కడ చాలా స్క్రిప్ట్‌లు విన్నానని, మూడు సినిమాలు చేశానని తెలిపారు. అయితే, అక్కడ ఒక్క కమర్షియల్ విజయాన్ని కూడా అందించలేకపోయానని నిజాయితీగా అంగీకరించారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేస్తానని అప్పట్లో ఆశాభావం వ్యక్తం చేశాడు ఉదయ్. తనపై ఉన్న ప్రశంసలు, విమర్శల గురించి ప్రస్తావిస్తూ, తన పట్ల ఇష్టపడేవారు, ఇష్టపడనివారు, విమర్శించేవారు, అభినందించేవారు ఉంటారని, ఇదంతా బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ప్రక్రియ అని అన్నారు. తనపై ఉన్న అనేక విషయాలు, పుకార్లకు తాను ఎప్పుడూ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించలేదని ఉదయ్ కిరణ్ స్పష్టం చేశారు. ఎందుకంటే, ఎంతమందికి వివరణ ఇస్తామని ఆయన ప్రశ్నించారు. ఇది తన స్వభావమని, మాట్లాడటం, వివరణలు ఇవ్వడం తన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులు సినిమాకు వచ్చేది వినోదం కోసమేనని, పాత్రలు దుఃఖిస్తున్నా కూడా వారికి వినోదం లభించాలని అన్నారు. ఆఫీసు టెన్షన్లు లేదా ఇతర ఒత్తిళ్లతో వచ్చే ప్రేక్షకులకు చివరకు మంచి వినోదం అందించడమే లక్ష్యమని చెప్పుకొచ్చారు. ప్రేక్షకులను కథలో లీనం చేసి, వారిని భావోద్వేగాలకు గురి చేయడమే మంచి కథ బలం అని ఉదయ్ కిరణ్ వివరించారు. తన అభిమాన బలం చెక్కుచెదరకుండా ఉందని, ఒక ఫీనిక్స్ పక్షిలా తిరిగి లేచి వస్తానని తన అభిమానులకు ఉదయ్ కిరణ్ హామీ ఇచ్చారు.
Also Read: పిలిచి రూ.50 లక్షలు ఇచ్చాడు.. ఆ నటుడి గురించి రాజారవీంద్ర ఎమోషనల్
