సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు అకాల మరణాన్ని అటు ప్రభాస్ కుటుంబసభ్యులు.. ఇటు అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నారు. కృష్ణంరాజుతో ప్రభాస్ గడిపిన క్షణాలను.. వారిద్దరు కలిసి నటించిన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరోవైపు పెదనాన్న మరణంతో మనసు నిండా బాధ ఉన్నా.. ఇప్పుడిప్పుడే షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు డార్లింగ్. ఈ క్రమంలోనే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన సూపర్ హిట్ చిత్రాలను రిరిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో హీరోస్ పుట్టినరోజు సందర్భంగా వాళ్లు కెరీర్ లోని సూపర్ హిట్ చిత్రాలను 4కె థియేటర్లలో రిరిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో… ఆయన నటించిన వర్షం, బిల్లా సినిమాలను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
ఇందులో ప్రభాస్, కృష్ణంరాజు కలిసి నటించి బిల్లా సినిమాను మరోసారి వెండితెరపై చూసేందుకు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిరిలీజ్ చేస్తుండడంతో చిత్రయూనిట్ శనివారం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కృష్ణంరాజు కుమార్తె సాయి ప్రసీద, కమెడియన్ అలీ, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, దర్శకుడు మెహర్ రమేష్, సంగీత దర్శకుడు మణిశర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు కుమార్తె సాయి ప్రసీద మాట్లాడుతూ.. “బిల్లా సినిమాతో మాకెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై డాడీ, అన్నయ్య కలిసి నటించిన చిత్రం బిల్లా మాకు చాలా స్పెషల్. మా మనసుకు దగ్గరైన సినిమా ఇది. ఈ సినిమాను మళ్లీ ప్రభాస్ అన్యయ్య పుట్టినరోజు సందర్భంగా ఈనెల 23న విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను 4కెలో రీరిలీజ్ చేస్తున్నందుకు మెహర్ రమేష్ అంకుల్ కు థాంక్యూ సో మచ్. ఈ మూవీ స్పెషల్ షో ద్వారా వచ్చిన వసూళ్లను యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ కు ఇవ్వబోతున్నాం. ఇందులో నాన్నగారు భాగస్వామిగా ఉన్నారు. యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ ద్వారా షుగర్ వ్యాధి తీవ్రమైన రోగులకు చికిత్స అందిస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. అలాగే మారుతి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్.. డైరెక్టర్ సందీప్ వంగాతో స్పిరిట్ చిత్రం చేయాల్సి ఉంది. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, దీపికా పదుకొణె కీలకపాత్రలలో నటిస్తున్నారు.