
కోలీవుడ్ ప్రముఖ నటుడు, స్టార్ కమెడియన్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతని భార్య నటి సంగీత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గురువారం (ఏప్రిల్ 03) తెల్లవారుజామున చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో సంగీత ఆడబిడ్డను ప్రసవించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారన్నారు. ఈ శుభవార్తను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోయాడు రెడిన్ కింగ్ స్లే. తన కూతురిని ఒళ్లో పెట్టుకుని చూసి మురిసిపోతోన్న ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ.. ‘మహా లక్ష్మి పుట్టింది. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు. అయితే ఈ ఫొటోలో తన కూతురి ముఖం కనిపించకుండా ఎమోజీతో కవర్ చేశాడీ నటుడు. ఇక సంగీత కూడా ఇదే ఫొటోను షేర్ చేస్తూ.. ‘మా జీవితంలో అద్బుతమైన కొత్త అధ్యాయం ఇప్పుడే ప్రారంభమైంది. ఇలాంటి సమయంలో మీరందరూ మాపై చూపిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మరువలేము. ఈ శుభవార్తతో మా ఫ్యామిలీ ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఇంతకు మించిన మధురమైన క్షణాలు మా జీవితంలో ఇంకేమీ ఉండవు అనుకుంటున్నాను. మా లిటిల్ ప్రిన్సెస్‌ను అందరూ ఆశీర్వదించండి ‘ అని సంగీత కోరింది.
ప్రస్తుతం రెడిన్ కింగ్ స్లే దంపతులు షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సంగీత దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రెడిన్ కింగ్ స్లే- సంగీతలది ప్రేమ వివాహం. 2023లో వీరి పెళ్లి జరిగింది. అయితే అప్పటికే 45 ప్లస్ లో ఉన్న రెడిన్ కింగ్ స్లే ఒక బుల్లితెర నటిని ప్రేమ వివాహం చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. వీరి ఏజ్ గ్యాప్ గురించి కొందరు విమర్శలు కూడా చేశారు. అయితే వీటిని ఏ మాత్రం లెక్కచేయకుండా తమ లైఫ్ ను లీడ్ చేస్తున్నారీ లవ్లీ కపుల్. ఇప్పుడు ఈ దాంపత్య బంధానికి ప్రతీకగానే తమ జీవితంలోకి ఓ బుజ్జి పాపాయిని ఆహ్వానించారీ దంపతులు.
కాగా వరుణ్ డాక్టర్ సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రెడిన్ కింగ్ స్లే. ఆ తర్వాత బీస్ట్, ది వారియర్, జైలర్, మార్క్ ఆంటోని, మ్యాక్స్, కంగువా, తదితర హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడీ స్టార్ నటుడు. ఇక గతేడాది కిరణ్ అబ్బవరం నటించిన బ్లాక్ బస్టర్ సినిమా క తో తెలుగు ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఈ నటుడి చేతిలో సుమారు అరడజనకు పైగా సినిమాలున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.