జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్. విభిన్న గెటప్పులతో అలరిస్తోన్న ఈ నటుడి ఖాతాలో ఇప్పటికే ఎన్నో అవార్డులు వచ్చి చేరాయి. తాజాగా ఈ స్టార్ హీరోకి మరో అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం చియాన్ విక్రమ్‌కు గోల్డెన్ వీసా అందజేసింది. కాగా వివిధ రంగాల్లో రాణిస్తూ, విశేష సేవా కార్యక్రమాలు చేస్తోన్న సెలబ్రిటీలకు దుబాయ్ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసా అందిస్తుంటుంది. 2019 నుంచి ప్రదానం చేస్తోన్న ఈ వీసాలను ఇంతకుముందు ప్రణీత, కాజల్ అగర్వాల్, మీనా, ఆండ్రియా, త్రిష, అమలాపాల్, కొణిదెల ఉపాసన, షారుఖ్ ఖాన్, కమల్ హాసన్, పార్తిబన్, విజయ్ సేతుపతి, శింబు, నాజర్, మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, పృథ్విరాజ్, సంజయ్ దత్, మీరా జాస్మిన్, అమలాపాల్, లక్ష్మీరాయ్ తదితరులు అందుకున్నారు. తాజాగా ఈ కోవలోనే విక్రమ్‌కు పదేళ్ల కాల పరిమితితో ఈ వీసా అందజేసింది. రెండు రోజుల క్రితం దుబాయ్ వెళ్లిన చియాన్‌కు ఘనంగా స్వాగతం పలికిన యూఏఈ ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక వీసా అందజేసింది. కాగా ఈ విషయాన్ని ప్రముఖ టాలీవుడ్ నటి పూర్ణ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
‘అత్యంత ప్రతిభావంతుడైన నటుడు విక్రమ్ సర్‌కి గోల్డెన్ వీసా అందించడంలో గౌరవం, ప్రత్యేకత ఉంది. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదృష్టంగా భావిస్తున్నాను’ అని ఈ పోస్టులో రాసుకొచ్చింది పూర్ణ. కాగా ఇందులో ఆమె భర్త షానిద్ ఆసీఫ్ చేతుల మీదుగా విక్రమ్ గోల్డెన్ వీసా అందుకోవడం మనం చూడవచ్చు. ఇది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. అయితే పూర్ణ భర్త చొరవతోనే విక్రమ్‌కు గోల్డెన్ వీసా వచ్చినట్లు తెలుస్తోంది. షానిద్ ఆసీఫ్ అలీ యూఏఈలో ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరు. ప్రస్తుతం అక్కడ ఆయన పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో షానీద్ తన కంపెనీ ద్వారా విక్రమ్‌కి గోల్డెన్ వీసా వచ్చేలా చేశాడని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..