విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీహరి. విలన్ గా కెరీర్ ప్రారంభించిన శ్రీహరి ఆతర్వాత హీరోగా సినిమాలు చేశారు. ఎన్నో సినిమాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించాడు. శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి. ఇండస్ట్రీలో ఇప్పటికి ఆయన గురించి.. ఆయన మంచి తనం గురించి చెప్పుకుంటుంటారు. స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీహరి.. అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. 1989లో తమిళ సినిమా మా పిళ్ళై, తెలుగు ‘ధర్మక్షేత్రం’ చిత్రం ద్వారా సినిమాల్లోకి అడుగు పెట్టారు. శ్రీహరి దాదాపు 100 సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
శ్రీహరి నటనతో ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అద్భుత పాత్రల్లో నటించారు శ్రీహరి. మగధీర సినిమాలో ఆయన పాత్ర సినిమాకే హైలైట్ అని చెప్పాలి. షేర్ ఖాన్ పాత్రలో తన గంభీరమైన గొంతుతో డైలాగులు చెప్పి ప్రేక్షకులను ఫిదా చేశారు. శ్రీహరి హీరోగా నటించిన కుబుసం, భద్రాచలం సినిమాలు మంచి విజయం సాధించాయి. అలాగే మంచు విష్ణు హీరోగా నటించిన ఢీ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, ఢీ, కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
అయితే సినిమాల్లోకి రాక ముందు శ్రీహరి ఏం చేశేవారో తెలుసా.? జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర స్థాయి చాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా.. సినిమాలపై మక్కువతో ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కాగా సినిమాల్లోకి రాక ముందు ‘మిస్టర్ హైదరాబాద్ గా ఏడుసార్లు అవార్డును సొంతం చేసుకున్నారు. ఏషియన్ గేమ్స్ లో భారతదేశం తరపున ఆడాలనే కోరిక ఉన్నా అది తీరలేదు.
శ్రీహరి ఫ్యామిలీ సినిమాల్లోకి రాక ముందు పాల వ్యాపారం చేశారు. హైదరాబాద్ లో శ్రీహరి కుటుంబం పాల బిజినెస్ అలాగే మెకానిక్ షెడ్ ద్వారా జీవనం సాగించేవారు. శ్రీహరి కూడా మెకానిక్ షెడ్ లో పని చేశారు. ఉదయం చదువుకుంటూ, సాయంత్రం శోభన థియేటర్ ఎదురుగా ఉన్న అన్న శ్రీనివాసరావు షెడ్డులో మెకానిక్ గా పనిచేస్తూ ఖాళీ దొరికిన సమయంలో సినిమాలు అదే థియేటర్ లో చూసేవాడు. శ్రీహరి ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు జరుపుతున్న సమయంలో దాసరి గుర్తించి బ్రహ్మనాయుడు సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆతర్వాత ఆయన విలన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. శ్రీహరి హీరోగా చేసిన మొదటి చిత్రం ‘పోలీస్’ అయితే.. హీరోగా చేసిన చివరి చిత్రం ‘పోలీస్ గేమ్’ కావడం విశేషం. కాగా బాలీవుడ్ రాంబో రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన శ్రీహరి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆయన్ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్టోబరు 9, 2013 న ముంబై లో శ్రీహరి కన్నుమూసారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.