
భారత్ నుంచి ఈ ఏడాది ఆస్కార్‌కు వెళ్తుందకున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి చుక్కెదరైంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరలవుతున్న వార్తలకు ఒక్కసారిగా పుల్ స్టాప్ పడింది. ఆర్ఆర్ఆర్ సినిమాతోపాటు.. మెగా పవర్ స్టార్ రామ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఆస్కార్ అవార్డు సొంతం చేసుకోనున్నారని అభిమానులు హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాను కాదని భారత్ తరపున చలో షో సినిమా అధికారికంగా నామినేట్ చేయడంతో… ఫ్యాన్స్ ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఎవరు ఊహించని విధంగా చలో షో సినిమా ఎంపికైంది. దీంతో అప్పటివరకు చాలా మందికి తెలియని ఈ సినిమా ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. బాక్సాఫీస్ ను షేక్ చేసి.. హాలీవుడ్ దర్శకుల మెప్పు పొందిన ట్రిబుల్ ఆర్ సినిమాను కాకుండా.. చిన్న సినిమాను ఎంచుకోవడంతో.. ఇంతకీ ఆ మూవీ ప్రత్యేకత ఏంటీ ? అంటూ సెర్చ్ చేస్తున్నారు. చలో షో (Chhello Show ) అనేది.. గుజరాతీ ప్రాంతీయ చిత్రం. తొమ్మిదేళ్ల వయసులో సినిమాతో ప్రేమలో పడిన ఓ కుర్రాడి కథ. గుజరాత్ రాష్ట్రంలోని ఓ మారుమూల పల్లెటూరులో జరిగే కథతో తెరకెక్కించిన మూవీ ఇది.
డైరెక్టర్ పాన్ నలిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సిద్ధార్థ్ రాయ్ కపూర్, పాన్ నలిన్, ధీర్ మోమయా, మార్క్ డ్యూలే నిర్మించారు. మాస్టర్ భవిన్ రబరి ప్రధాన పాత్రలో తన బాల్య జ్ఞాపకాలనే సినిమాగా తెరకెక్కించారు డైరెక్టర్ పాన్ నలిన్. ఈ మూవీ ది లాస్ట్ షో పేరుతో దేశవ్యాప్తంగా అక్టోబర్ 14న ఇంగ్లీష్ భాషలో విడుదల కానుంది. ఇందులో భవిన్ రాబరి, వికాస్ బాటా, రిచా మీనా, భవేష్ శ్రీమాలి, డిపెన్ రావల్, రాహుల్ కోలీ నటించారు. ఈ సినిమా ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రారంభ చిత్రంగా ఈ చిత్రం ప్రపంచ ప్రీమియర్‌ను ప్రదర్శించింది. అలాగే స్పెయిన్‌లో జరిగిన 66వ వల్లాడోలిడ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గోల్డెన్ స్పైక్‌తో సహా పలు అవార్డులను గెలుచుకుంది.
ఇక చలో షో కథ విషయానికి వస్తే.. గుజరాత్ లోని చలాలా అనే పల్లెటూరులో పుట్టిపెరిగిన ఓ తొమ్మిదేళ్ల కుర్రాడు సమయ్. అతడికి థియేటర్ ప్రొజెక్టర్ ఆపరేటర్‌తో పరిచయం ఏర్పడుతుంది. దీంతో తరచూ ప్రొజెక్షన్ గదిలోకి వెళ్తుంటాడు. ప్రొజెక్టర్ నుంచి వచ్చే కాంతి తెరపై బొమ్మగా మారడం అతనిలో మరింత ఆసక్తిని పెంచుతుంది. ప్రొజెక్షన్ రూంలో కూర్చుని వేసవి కాలం మొత్తం గడిపేస్తాడు. ఇక ఆ సమయంలోనే అతడికి సినిమా అంటే ఇష్టం ఏర్పడుతుంది. దీంతో సినిమాను పిచ్చిగా ప్రేమించడం మొదలుపెడతాడు. ఆ ఇష్టం అతడి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది. చివరికి తన అతడు తన కలను ఎలా నెరవేర్చుకున్నాడు ? అన్నదే కథాంశం.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.