
ప్రముఖ గాయని ఆశా భోంస్లే మరణం పట్ల సినీ ప్రముఖులు అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు . అయితే , ఈ విషాద సమయంలో నటి అతియా శెట్టి చేసిన ఒక పొరపాటు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు, ఆగ్రహానికి కారణమైంది. ఆశా భోంస్లేకు నివాళులర్పిస్తూ అతియా ఆమె లతా మంగేష్కర్ ఫొటోను షేర్ చేయడమే ఈ వివాదానికి కారణం .
ఏప్రిల్ 12న ముంబైలో ఆశా భోంస్లే కన్నుమూసిన తర్వాత, సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సంతాప సందేశాన్ని పోస్ట్ చేసింది. అయితే, ఆమె ఆశా భోంస్లే ఫొటో బదులుగా, 2022లో కన్నుమూసిన లతా మంగేష్కర్ ఫొటోను జతచేసింది. కొద్ది క్షణాల్లోనే అతియా పోస్ట్ వైరలయ్యింది. నెటిజన్లు వెంటనే తప్పును గుర్తించి అతియాపై విరుచుకుపడ్డారు. పొరపాటును గ్రహించిన వెంటనే అతియా ఆ పోస్ట్‌ను తొలగించి, ఆ తర్వాత ఆశా భోస్లే సరైన ఫోటోను షేర్ చేసినప్పటికీ, దాని స్క్రీన్‌షాట్‌లు అప్పటికే వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలో నెటిజన్లు అతియాను తీవ్రంగా విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఒక నెటిజన్ ‘అతియా శెట్టికి కనీస జ్ఞానం కూడా లేదు. ఆమె ఆశా భోంస్లే ఫోటోకు బదులుగా లతాజీ ఫోటోను పోస్ట్ చేసింది. నెపో కిడ్స్ కష్టపడకుండానే పేరు ప్రఖ్యాతులు కోరుకుంటారు. అందుకే వాళ్లు ఇలాంటి తెలివితక్కువ పనులు చేస్తారు’ అని అతియా గురించి షాకింగ్ కామెంట్ పెట్టాడు.
Athiya Shetty Post
‘ ఇలాంటి విషయాల పట్ల ఇంత ఉదాసీనంగా ఉండటం సరికాదు. కనీసం ఆ ఫోటో సరైనదో కాదో కూడా చూసుకునే మార్గం లేకపోతే, వాళ్లు మౌనంగా ఉండాల్సింది’ అని మరో నెటిజన్ అతియాకు సలహా ఇచ్చాడు. సొంత సినీ పరిశ్రమలోని పెద్దల పట్ల ఇంత అజ్ఞానంగా ప్రవర్తించడం సరికాదంటూ మరికొందరు అతియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మరికొందరు అతియాకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె తెలియక పోస్ట్ చేసిందని, వెంటనే పొరపాటును సరిదిద్దుకుందంటూ నటికి మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.