పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ఖుషి ఒకటి. డైరెక్టర్ ఎస్ జె సూర్య తెరకెక్కించిన ఈ సినిమాలో పవన్ సరసన భూమిక కథానాయికగా నటించింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా ఈ సినిమాను నిర్మించిన శ్రీ సూర్య మూవీ ఎంటర్టైన్మెంట్స్ ఖుషి చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యింది. ఈరోజు (డిసెంబర్ 31న) ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విడుదల చేశారు. దీంతో మళ్లీ ఈ సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానుల కోరిక నెరవేరింది. అయితే ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్న సందర్భంగా ఖుషి సినిమా సమయంలోని కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు డైరెక్టర్ ఎస్ జె సూర్య.
వాలి సినిమా హిట్ తర్వాత ఏఎమ్ రత్నం.. తనకు పవన్ కళ్యాణ్ ను పరిచయం చేశారని అన్నారు. అప్పటికే తాను బద్రీ, తమ్ముడు సినిమాలు చూశానని.. బ్యా్క్ టూ బ్యాక్ హిట్స్ కొట్టిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ చాలా సింపుల్ గా ఉన్నాడని తెలిపారు. తాను మొదటిసారి పవన్ కళ్యాణ్ కు ఖుషి సినిమా స్టోరీ చెప్పేందుకు వెళ్లినప్పుడు.. పవన్ ఒక టేబుల్ మీద కారు బొమ్మ పెట్టి.. చిన్నపిల్లాడిలాగా దానితో ఆడుకుంటున్నారని.. అది చూసి తాను ఆశ్చర్యపోయాను అని అన్నారు.
హిట్స్ కొట్టిన తర్వాత ఇంత నార్మల్ గా ఎలా ఉన్నారు అనిపించింది. అప్పటికీ తమిళ ఖుషీ మూవీ ఇంకా స్టార్ట్ కూడా కాలేదని.. పవన్ కు కథ చెప్పడంతో ఆయనకు నచ్చి ఒకే చేసారని అన్నారు. ఇక ఇప్పటికీ మళ్లీ పవన్ తో ఆ రేంజులో ఇంకో సినిమా చేయలేదనే బాధ తనకు ఉందంటూ చెప్పుకొచ్చారు.