లోకనాయకుడు కమల్‌హాసన్ టాలెంట్ గురించి సౌత్ జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాకు సంబంధించి కేవలం నటన మాత్రమే కాదు 24 విభాగాల్లోనూ ఆయనకు ప్రావీణ్యం ఉంది. సినిమానే శ్వాసగా, ధ్యాసగా భావిస్తారు కమల్. కాగా 1992లో వచ్చిన ‘క్షత్రియపుత్రుడు’ చిత్రానికి స్టోరీని అందించింది కమల్‌హాసనే. భరతన్ తెరకెక్కించిన ఈ సినిమాలో శివాజీ గణేషన్, రేవతి, గౌతమి, నాజర్‌లాంటి నటించి మెప్పించారు. జాతీయ చలనచిత్ర అవార్డుతో పాటు మరెన్నో అవార్డులు, రివార్డులు సాధించిందీ చిత్రం. తాజాగా కమల్ సోషల్ మీడియాలో ఏ.ఆర్.రెహమాన్‌తో ముచ్చటిస్తూ.. ఆయన ‘క్షత్రియపుత్రుడు’ సినిమాకు కేవలం ఏడు రోజుల్లో స్క్రిప్టు రాసినట్లు వివరించాడు.
“నేను ‘క్షత్రియపుత్రుడు’ చిత్రానికి స్క్రిప్టు రాస్తున్నప్పుడు, నా మిత్రుడొకరు ఒక సవాల్ విసిరాడు. స్క్రిప్టు తొందరగా కంప్లీట్ చెయ్ లేదా మూవీ అయినా వదిలేయమని చెప్పాడు. ఆ సవాల్ స్వీకరించిన నేను.. మొత్తం ఏడు రోజుల్లో సినిమా స్క్రిప్టు రెడీ చేసి ఇచ్చాను. అయితే అన్ని సినిమాలకు ఏడు రోజుల్లో కథలు రాయడం అంత ఈజీ కాదు. కొన్ని స్క్రిప్టులు నెలలు, సంవత్సరాలు కూడా తీసకుంటాయి. కొన్నిసార్లు సూట్‌కేసు నిండా డబ్బుపెట్టి స్క్రిప్టు రాయమన్నా అది సాధ్యమయ్యే పనికాదు” అని కమల్‌హాసన్ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం కమల్.. శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు 2’ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.