స్టార్ హీరోలతో హుషారైన స్టెప్పులు వేయించే జానీ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచం అక్కర్లేదు. టాలీవుడ్‌లో స్వయంకృషితో ఎదిగిన అతి కొద్ది మంది కొరియోగ్రాఫర్లలో జానీ కూడా ఒకరు. 2009 నితిన్ ద్రోణ సినిమాలో డ్యాన్స్‌మాస్టర్‌గా టాలీవుడ్‌లోకి అడుగపెట్టిన ఆయన రచ్చ, జులాయి, నాయక్, బాద్షా, ఇద్దరమ్మాయిలతో, ఎవడు, రేసు గుర్రం, పిల్లా నువ్వులేని జీవితం, టెంపర్, సన్ ఆఫ్ సత్యమూర్తి, బాహుబలి, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, ఇస్మార్ట్ శంకర్, అలా వైకుంఠ పురంలో, బీస్ట్, వారసుడు వంటి హిట్ సినిమాలకు కొరియోగ్రఫీ అందించాడు. కేవలం దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్‌లో సల్మాన్ వంటి స్టార్ హీరోలతో పనిచేశాడాయన. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ మధ్యన ఎక్కువగా ప్రజల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు జానీ మాస్టర్. నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన అక్కడ విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నాడు. తాజాగా మరోసారి తన ఉదారతను చాటుకున్నాడీ డ్యాన్స్ మాస్టర్. నెల్లూరు పొదలకూరు రోడ్డు, ప్రగతి నగర్‌లో ఉన్న మదరసా ఈ మినర్వా సంస్థకు రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశాడు. అంతేకాదు మదరసా నిర్వహణకు ప్రతినెలా పదివేల రూపాయల చొప్పున ఏడాది పాటు ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించాడు.
అలాగే నెల్లూరు జిల్లాలోని తరునవాయిలో అంగన్‌వాడీల నిరసనల్లో గురై కన్నుమూసిన వనమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు జానీ మాస్టర్. ఆర్థిక అవసరాల కోసం కుటుంబ సభ్యులకు రూ.70 వేల ఆర్థిక సహాయం అందించారు. అంగన్ వాడీల ఆర్థిక పరిస్థితులను, జీవన ప్రమాణాలను ప్రభుత్వం గమనించాలని, వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలని మాస్టర్ కోరారు. వచ్చే ఎన్నికల్లో జానీ మాస్టర్ పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌ను అమితంగా ఆరాధించే ఆయన జనసేన పార్టీ నుంచి ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు సమాచారం. అందుకే సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ నిత్యం జనాల్లో తిరుగుతున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.