Hyper Aadi: వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా హైపర్ ఆది.. అధినేత నుంచి హామి !

అతని కామెడీ టైమింగ్‌ అదుర్స్‌. పంచ్‌లేశాడంటే జడ్జెస్‌ కూడా పడీపడీ నవ్వాల్సిందే. బుల్లితెరపై క్రేజ్‌ తెచ్చుకుని వెండితెరదాకా అడుగులేసిన ఆ నటుడు పాలిటిక్స్‌వైపు చూస్తున్నాడు. స్టేజీ ఎక్కి స్పీచ్‌ దంచేశాడు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటూ సంకేతాలిస్తున్నాడు. టికెట్‌ ఇస్తామని అధినేత భరోసా ఇచ్చారా?

Hyper Aadi: వచ్చే ఎన్నికల్లో జనసేన నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా హైపర్ ఆది.. అధినేత నుంచి హామి !
Jabardasth Hyper Aadi

Updated on: Jan 13, 2023 | 8:49 PM

జబర్దస్త్‌ కామెడీనే కాదు సీరియస్‌ పాలిటిక్స్ కూడా చేయగలననని ప్రూవ్‌ చేసుకోవాలనుకుంటున్నాడు ఆది..హైపర్‌ ఆది. షార్ట్‌ టైమ్‌లోనే మంచి టైమింగ్‌ ఉన్న కామెడీతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హైపర్‌ ఆది..ప్రస్తుతం తన వాక్చాతుర్యం, పంచులతో సోషల్ మీడియాలో హైలైట్‌ అవుతున్నాడు. బీటెక్ చదివిన ఆది హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసే టైంలో ఒక షార్ట్ ఫిల్మ్‌తో జబర్దస్త్ టీం లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఓపెనింగ్‌ ఎపిసోడ్‌తోనే తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ సృష్టించుకున్నాడీ పంచ్‌ల స్పెషలిస్ట్‌.

ఆది స్వస్థలం ప్రకాశం జిల్లా చీమకుర్తి. బుల్లితెరపై కామెడీ ప్రోగ్రాంతో మెగా ఫ్యామిలీకి దగ్గరేన హైపర్ ఆది ఇప్పుడు రాజకీయాలవైపు చూస్తున్నాడు. పోయిన ఎన్నికల్లోనే జనసేన తరఫున నాగబాబుతో కలిసి ప్రచారం చేశాడు ఆది. క్రిష్‌ దర్శకత్వంలో వస్తున్న హరహర వీరమల్లు సిన్మాలో నటిస్తున్న ఆది.. ఆ షూటింగ్‌ స్పాట్‌లోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కి మరింత దగ్గరైనట్లు చెబుతున్నారు. ఆ చొరవే ఆదిని జనసేన వేదిక ఎక్కించింది. ప్రత్యేకంగా పావుగంటసేపు మాట్లాడే అవకాశం ఇచ్చింది. ఆది ఆకట్టుకునేలా మాట్లాడిన తీరు. ఆయన స్పీచ్‌ని పవన్ కళ్యాణ్ కూడా ఎంజాయ్ చేయడాన్ని అంతా గమనించారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని టార్గెట్‌ చేసుకుని విమర్శించేవారిపై రణస్థలం సభలో పంచ్‌ల వర్షం కురిపించాడు హైపర్‌ ఆది. గతం నుంచీ ఆది ఎన్నో పబ్లిక్ మీటింగుల్లో, కార్యక్రమాల్లో పవర్‌స్టార్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. శ్రీకాకుళం యువశక్తి మీటింగ్‌లో మాత్రం ఒక అభ్యర్థిగా మాట్లాడుతున్నా అన్న పదానికి అర్ధాలు వేరేనంటున్నాయ్‌ పొలిటికల్ సర్కిల్స్. జనసేన అధినేత నుంచి హామీ ఉండబట్టే ఆది అంతదూరం వెళ్లి ఉంటాడని చెప్పుకుంటున్నారు.

ఏదైనా సబ్జెక్ట్‌ని ఈజీగా హత్తుకునేలా కమ్యూనికేట్ చేయగలిగే ఆది.. రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరింత చేరువవుతాడన్న అభిప్రాయంతో ఉన్నారు జనసేన నేతలు. వ్యక్తిగతంగా పవన్‌ని అభిమానించే ఆది జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారంటున్నారు. పంచ్ స్టైల్‌తో గోదావరి జిల్లావాసిలా కనిపించినా ఆది పుట్టింది మాత్రం ప్రకాశం జిల్లాలో చీమకుర్తిలో. జనసేన ఈక్వేషన్లను బట్టి ఎక్కడ సీటు కేటాయించినా తనకు ఓకే అంటున్నాడట హైపర్‌ ఆది.

మొత్తానికి గత ఎన్నికల్లో ఎర్ర తువాలుతో ప్రచారం చేసిన ఆది వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థిగా జనంలోకి వెళ్లే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. మరి ఈసారి తనకోసం తానే ప్రచారం చేసుకుంటాడా, లేదంటే మరోసారి పార్టీకి అండగా నిలబడేందుకు ఏమీ ఆశించకుండానే ప్రచారంలో పాలుపంచుకుంటాడో చూడాల్సిందే.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.