
సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ ధ్రువ తార.. చిన్నవయసులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీని షేక్ చేసింది నటి దివ్యభారతి. స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది దివ్యభారతి. తిరుగులేని హీరోయిన్ గా మారుతుంది అనుకునే సమయంలో ఆమె మరణం అందరికి ఊహించని షాక్ ఇచ్చింది. 1993 ఏప్రిల్ 5న బాలీవుడ్ నటి దివ్యభారతి మరణ వార్త దేశాన్ని కలచివేసింది. ముఖ్యంగా సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. దివ్యభారతి 1974 ఫిబ్రవరి 25న ముంబైలోని ఒక మధ్యతరగతి మరాఠీ కుటుంబంలో జన్మించింది. చిన్నతనం నుంచీ చురుకుగా ఉండే ఆమె చదువులో వెనుకబడి ఉండేది. టీనేజ్‌కు రాగానే చదువు మానేసి మోడలింగ్ వైపు దృష్టి సారించింది. 15 ఏళ్ల వయసులోనే ఆమె అందానికి ముగ్ధులై అనేక మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. కుటుంబం వ్యతిరేకించినా, ఆమె మోడలింగ్‌ను కొనసాగించింది.
మొదట బాలీవుడ్ నటుడు గోవిందా తమ్ముడు కీర్తి కుమార్ దృష్టిలో పడి, రాధా కా సంగమ్ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం పొందింది. అయితే వయసు తక్కువగా ఉండటం వల్ల ఆ చిత్రం నుంచి తొలగించారు. దీంతో దివ్యభారతి డిప్రెషన్‌కు లోనైంది. ఆమె బాధను చూడలేక, తల్లిదండ్రులు సినిమాల్లో నటించడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారట. 16 ఏళ్ల వయసులో తెలుగులో వెంకటేష్ సరసన బొబ్బిలి రాజా సినిమాతో అరంగేట్రం చేసింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టవడంతో, దివ్యభారతి ఓవర్ నైట్ లో స్టార్‌గా మారిపోయింది. ఆమె అందం, అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. మోహన్‌బాబుతో అసెంబ్లీ రౌడీ, చిరంజీవితో రౌడీ అల్లుడు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ గా మారిపోయింది. ఆతర్వాత బాలీవుడ్‌కు చేరుకుంది. 1990లో రెండే సినిమాలు చేసిన దివ్యభారతి, 1991లో నాలుగు, 1992లో బాలీవుడ్, టాలీవుడ్‌లలో కలిపి 11 సినిమాల్లో నటించింది. 14 నెలల్లో బాలీవుడ్‌లో 14 సినిమాలకు సైన్ చేసి, అతి తక్కువ సమయంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా మారింది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు దివ్యభారతి తీసుకున్న ఒక నిర్ణయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది.
17 ఏళ్ల వయసులో తనకంటే 12 ఏళ్లు పెద్దవాడైన బాలీవుడ్ నిర్మాత సాజిద్ నదియాద్వాలాను ప్రేమించింది. కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా 1992లో తన 18వ పుట్టినరోజు తర్వాత రెండు నెలలకే సాజిద్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి కోసం తన పేరును సనా నదియాద్వాలాగా మార్చుకుంది. ఈ వివాహాన్ని చాలాకాలం రహస్యంగా ఉంచింది. అయితే, సాజిద్‌కు దావూద్ గ్యాంగ్‌తో ఉన్న సంబంధాలు దివ్యభారతి జీవితంలో పెద్ద సమస్యగా మారాయి. ఈ విషయాలు దివ్యభారతికి తెలిసిన తర్వాత వారి మధ్య తీవ్ర మనస్పర్ధలు, గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ ఒత్తిడితో దివ్యభారతి డిప్రెషన్‌కు లోనై, మద్యానికి, మాదకద్రవ్యాలకు బానిసయ్యింది. 1993 ఏప్రిల్ 5న దివ్యభారతి తన ముంబైలోని అంధేరి వెస్ట్‌లోని తులసి అపార్ట్‌మెంట్ ఐదవ అంతస్తులోని ఫ్లాట్‌లో ఉంది. ఆ సాయంత్రం ఆమె స్నేహితురాలు, కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా, ఆమె భర్త శ్యామ్ లుల్లా అక్కడకు వచ్చారు. పనిమనిషి అమృత కిచెన్‌లో ఉండగా, వీరు ముగ్గురూ మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న దివ్యభారతి తన ఫ్లాట్ బాల్కనీ విండోలో కూర్చుంది. అది ఆమెకు అలవాటు. అకస్మాత్తుగా ఆమె గట్టిగా అరిచి, బాల్కనీ నుంచి కిందకు పడిపోయింది. తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. ఐదేళ్ల విచారణ తర్వాత, పోలీసులు దివ్యభారతి మరణాన్ని ప్రమాదవశాత్తు జరిగినట్లు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి కేసును ముగించారు. అయినప్పటికీ, ఆమె మరణం వెనుక హత్యా లేక ఆత్మహత్యా అనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.