Ilayaraja: స్వామి, అమ్మవార్లకు వజ్రాల కిరిటం, వెండి కత్తి సమర్పించిన ఇళయరాజా.. విలువ ఎంతో తెలుసా?

ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు దైవ భక్తి ఎక్కువ. తరచూ ప్రముఖ దేవాలయాలను సందర్శించే ఆయన స్వామి, అమ్మవార్లకు విలువైన కానుకలు సమర్పిస్తుంటారు. తాజాగా ఆయన ఓ ప్రముఖ దేవాలయానికి వజ్రాల కిరిటంతో పాటు వెండి కత్తిని కానుకలుగా సమర్పించారు.

Ilayaraja: స్వామి, అమ్మవార్లకు వజ్రాల కిరిటం, వెండి కత్తి సమర్పించిన ఇళయరాజా.. విలువ ఎంతో తెలుసా?
Ilayaraja

Updated on: Sep 11, 2025 | 7:23 PM

ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా గురువారం (సెప్టెంబర్ 11) కర్ణాటక ఉడుపిలోని కొల్లూరు మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అమ్మవారికి రూ.4 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన వెండి కిరీటాన్ని కానుకగా సమర్పించారు. అలాగే, వీరభద్ర స్వామికి వెండి కత్తిని బహూకరించారు. ఆలయ అర్చకులు దగ్గరుండి ఇళయరాజాతో పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటాన్ని అందజేశారు. ఇళయరాజా వెంట ఆయన తనయుడు కార్తిక్‌, మనవడు యతీశ్‌ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ఇళయరాజా అమ్మవారికి సమర్పించుకున్న కిరీటం, కత్తికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దైవ భక్తి మెండుగా ఉండే ఈ దిగ్గజ సంగీత దర్శకుడు తరచుగా మూకాంబిక అమ్మవారి ని దర్శించుకుంటారు. 2006లో కూడా ఆయన అమ్మవారికి ఓ విలువైన కిరీటం బహుమతిగా ఇచ్చారు.

“ఆ జగన్మాత మూకాంబిక అమ్మవారి ఆశీస్సులే వల్లే నా జీవితంలో ప్రతిదీ సాధ్యమైంది. నేను ప్రత్యేకంగా చేసింది ఏమీలేదు’ అని ఈ సందర్భంగా మీడియాతో చెప్పుకొచ్చారు ఇళయ రాజా. ఇక దిగ్గజ సంగీత దర్శకుడైనా ఇళయ రాజా సాధారణ భక్తుడిగానే ఈ ఆలయానికి వస్తుంటారని, గతంలోనూ ఆయన అమ్మవారికి ఓ కిరీటం బహూకరించారని మూకాంబిక ఆలయం మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ బాబు శెట్టి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మూకాంబిక అమ్మవారికి వజ్ర కిరీటం బహూకరిస్తోన్న ఇళయరాజా..


గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇళయరాజా అంతగా సినిమాల్లో యాక్టివ్ గా ఉండడం లేదు. సెలెక్టివ్ సినిమాలకే సంగీతం అందిస్తున్నారు. అదే సమయంలో తన అనుమతి లేకుండా తన పాటలను సినిమాల్లో ఉపయోగించడంపై కాపీ రైట్ కేసులు వేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ దర్శక నిర్మాతలకు కూడా ఇదే విషయంలో లీగల్ నోటీసు పంపారు. తన పాటలను వినియోగించుకున్నందుకు రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై న్యాయ స్థానం కూడా ఇళయరాజాకు మద్దతుగా తీర్పునిచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.