
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. అలాగే పైరసీ స్కామ్ గుట్టు తెలసుకునేందుకు పోలీసులు కూడా అతనిని విచారిస్తున్నారు. ఈ క్రమంలో రవి ఆగడాల గురించి సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అతను సినిమాలను పైరసీ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేసినట్టు తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా సినిమాలను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు వేలాది కోట్ల నష్టం కలిగించిన ఐ బొమ్మ రవి అరెస్ట్ పట్ల టాలీవుడ్ సంబరపడుతోంది. పలువురు హీరోలు, దర్శక నిర్మాతలు ఇమ్మడి రవి అరెస్టును స్వాగతిస్తున్నారు. ఇందుకు గానూ హైదరాబాద్ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇదే క్రమంలో శివాజీ, సీవీఎల్ వంటి మరికొందరు సినీ ప్రముఖులు ఇమ్మడి రవి ట్యాలెంట్ ను ఇతర పనులకు ఉపయోగించుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే బయట చాలా మంది ఐ బొమ్మ రవిని ఒక రియల్ హీరోగా అభివర్ణిస్తున్నారు. ఐ బొమ్మ రవి పేదల పాలిట దేవుడంటూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.అలా తాజాగా ఓ అభిమాని వినూత్న రీతిలో ఐ బొమ్మ రవికి మద్దతు తెలియజేశాడు. పైరసీ కింగ్ కు సపోర్టుగా పచ్చబొట్టు వేయించుకున్నాడు.
ఐ బొమ్మ రవికి మద్దతు తెలియజేస్తూ ఒక అభిమాని ఏకంగా తన పొట్టపై ఐ బొమ్మ అని టాటూ వేయించుకున్నారు. ఆ అభిమాని వివరాలేంటో పక్కాగా తెలియదు కానీ.. ‘ఐ బొమ్మ కమింగ్ సూన్’ అంటూ పొట్టపై పచ్చబొట్టు వేయించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గామారింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే ఇలా ఐబొమ్మ రవికి బయట, సోషల్ మీడియాలోనూ అనూహ్యంగా మద్దతు పెరగడం ఇప్పుడు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇదే నేపథ్యంలో ఇమ్మడి రవి తండ్రి అప్పారావు కామెంట్స్ కూడా సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా సినిమా టికెట్ల ధరలను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో కలకలం రేపుతున్నాయి.
కాగా ఐబొమ్మ రవికి కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ సోమవారం (నవంబర్ 24) తో ముగియనుంది. దీంతో మరోసారి అతనిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.