
తెలుగు సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ ఏడాది ప్రపంచ సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన దేశం నుంచి వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ ది రివేంజ్ (ధురందర్ 2) సంచలన విజయం సాధించింది. తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కినప్పటికీ మూవీ దాదాపు రూ. 1900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక హాలీవుడ్ లో అయితే ‘మైఖేల్’, ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’, ‘ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ’ వంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తూ థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓ చిన్న సినిమా వీటన్నింటినీ వెనక్కు నెట్టింది. మే 15న విడుదలైన ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే 1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఈ మూవీ బడ్జెట కేవలం 10 కోట్ల లోపే. అంటే కేవలం వారం రోజుల్లోపే పెట్టిన పెట్టుబడిపై 10,000 శాతానికి పైగా లాభాలను అర్జించిన ఈ మూవీ ఈ ఏడాది అత్యంత లాభదాయకమైన చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా?
హాలీవుడ్ రైటర్ కమ్ డైరెక్టర్ కర్రీ బార్కర్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా అబ్సెషన్. హారర్ థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీలో మైఖేల్ జాన్‌స్టన్ ప్రధాన పాత్రలో నటించాడు. ఇండీ నవరెట్ ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పెషల్ స్క్రీనింగ్ కు ఎంపికైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఉత్కంఠ రేపే సీన్లు, ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను థియేటర్లలో సీట్ల అంచున కూర్చుండేలా చేస్తోంది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. బెయిర్ (మైఖేల్ జాన్‌స్టన్) అనే ఓ మ్యూజిక్ స్టోర్ ఉద్యోగికి ఒక అతీత శక్తులున్న వింత బొమ్మ దొరుకుతుంది. తన చిన్ననాటి స్నేహితురాలు నిక్కీ (ఇండీ నవరెట్) తనతో ప్రేమలో పడాలని ఆ బొమ్మను కోరుతాడు. బెయిర్ కోరిక తీరినప్పటికీ, దాని వల్ల అతడి జీవితంలో భయంకరమైన పరిణామాలను ఎదుర్కొంటాడు. మరి అవేంటి? చివరకు బెయిర్ ఏమయ్యాన్నదే ఈ సినిమా కథ. అయితే ప్రస్తుతం ఈ సినిమా కేవలం ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే రన్ అవుతోంది. పూర్తి స్థాయి రిలీజ్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.