
ఆనందం చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నటుడు ఆకాశ్. ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఆకాష్. ఆతర్వాత వరుసగా అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు.. కానీ అలా జరగలేదు. పెద్దగా ఆఫర్స్ రాకపోవడమే కాదు.. చేసిన ఒకటి రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆకాష్. గతంలో ఆకాష్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలను, తనకు జరిగిన మోసాలను వెల్లడించాడు ఆకాష్. తాను తెలుగు చిత్ర పరిశ్రమ నుండి దూరంగా వెళ్లడానికి గల ప్రధాన కారణాలను వివరిస్తూ, తన అభిమానుల కోరిక మేరకే మళ్ళీ తెలుగులో సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చాడు.
ఆనందం లాంటి భారీ విజయం సాధించిన తర్వాత కూడా తెలుగులో పెద్ద దర్శకుల నుంచి తనకు హీరోగా సరైన అవకాశాలు రాలేదని ఆకాశ్ తెలిపాడు. ఆనందం తర్వాత తనకు వచ్చిన పెద్ద సినిమా ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలోనేనని ఆయన తెలిపాడు. గోరింటాకు వంటి కొన్ని చిత్రాలు చేసినప్పటికీ, అప్పటికే తనను తెలుగు పరిశ్రమలో సెకండ్ హీరో లేదా సైడ్ క్యారెక్టర్లుగా పరిమితం చేయాలని చూశారని, ఈ ఆఫర్లు తనకు నచ్చకపోవడంతో వాటిని తిరస్కరించానని ఆకాశ్ స్పష్టం చేశాడు. హీరోగా కెరీర్ మొదలుపెట్టిన తర్వాత సహాయ పాత్రలు చేయడం తనకి ఇష్టం లేదని ఆయన చెప్పుకొచ్చాడు.
అందాల రాముడు సినిమాలో నటించడం తనకు అత్యంత బాధాకరమైన అనుభవమని ఆకాశ్ పేర్కొన్నారు. తాను హీరోగా చేస్తున్న సమయంలో స్నేహితుడిగా సునీల్‌కు మాట ఇచ్చానని, ఆ సినిమా కోసం తమిళంలో హీరోగా తాను చేస్తున్న సినిమా షూటింగ్ ఆపి మరీ వచ్చి నటించానని తెలిపాడు. సునీల్ ఫోన్ చేసి తన సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర చేయమని అడగడంతో, మాట నిలబెట్టుకోవడానికి వచ్చినట్లు తెలిపాడు. షూటింగ్ పూర్తయిన తర్వాత సునీల్ తన సహాయాన్ని జీవితంలో మర్చిపోనని చెప్పాడని ఆకాశ్ గుర్తుచేసుకున్నాడు. కానీ, సినిమా విడుదలైన తర్వాత తన పాత్ర క్లైమాక్స్‌లో గొడవకు కారణమయ్యే విధంగా ఉండటం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆకాశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమా విడుదలయ్యాక ఎంతో మంది ప్రేక్షకులు ఫోన్ చేసి, మీరు హీరో, ఒక కమెడియన్ పక్కన అలాంటి పాత్ర ఎందుకు చేశారు.? అని ప్రశ్నించి, తనను తిట్టారని తెలిపాడు. అయితే, ఆ విమర్శలు కూడా తనకు పెద్దగా అనిపించలేదని, కానీ తాను ఎవరి కోసం సినిమా చేశానో, ఆ సునీల్ సినిమా విజయం తర్వాత తన గురించి ఒక్క మంచి మాట కూడా చెప్పకపోవడం తనను తీవ్రంగా బాధించిందని ఆకాశ్ తెలిపాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి