కన్నడ సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపిన డ్రగ్స్ కేసులో ప్రముక నటి రాగిణి ద్వివేదికి భారీ ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి రాగిణిని సెప్టెంబర్ 2020లో అరెస్టు చేశారు. చాలా రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించిందామె. ఇప్పుడీ కేసులో నాలుగేళ్ల తర్వాత రాగిణి నిర్దోషి అని తేలింది. నటికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించకపోవడంతో, కేసును నిర్దోషిగా విడుదల చేస్తూ హైకోర్టు ఆదేశించింది. దీంతో రాగిణికి భారీ ఊరట లభించినట్లయింది. పేరుకు కన్నడ నటే అయినప్పటికీ తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో నటించింది రాగిణి ద్వివేది. నాని నటించిన జెండాపై కపిరాజు సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను కూడా పలకరించింది.
కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోన్న రాగిణికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. పార్టీ పెట్టి డ్రగ్స్ వాడేందుకు ప్రోత్సహించారని ఈ అందాల తారపై అభియోగాలు నమోదయ్యాయి. దీనికి సంబంధించి రాగిణిపై నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్(ఎన్‌డీపీఎస్) చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతున్నారు. సహ నిందితుల వాంగ్మూలం ఆధారంగా రాగిణిపై కేసు నమోదు చేశారు. అయితే రాగిణి తరఫు న్యాయవాది ఏ మాత్రం ఎలాంటి ఆధారాలు అందించలేదని న్యాయస్థానానికి తెలియజేశారు. ఈ క్రమంలో న్యాయమూర్తి హేమంత్ చందన్ గౌడర్ నేతృత్వంలోని హైకోర్టు సింగిల్ మెంబర్ బెంచ్ ఈ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏ4 ప్రశాంత్ రాంకాపై కేసు కూడా కొట్టివేసింది.
రాగిణి ద్వివేది కన్నడలో పలు హిట్ సినిమాల్లో నటించింది. గోకుల, శంకర్ ఐపీఎస్, హోలి, నాయక, ‘కెంపె గౌడ, కాంచన, ఆరక్షణ, విక్టరీ, రాగిణి ఐపీఎస్, నమస్తే మేడమ్, శివమ్, కిచ్చు తదితర హిట్ సినిమాల్లో నటించింది. ఇక సముద్రఖని దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెండాపై కపిరాజు సినిమాలో ఓ కీలక పాత్ర పోషించిందీ అందాల తార. అయితే నాలుగేళ్ల క్రితం ఆమెపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలు సినిమా ఇండస్ట్రీలో సంచలనం రేపాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.