మెగాస్టార్ కెరీర్లో ఒకే ఒక్క హాలీవుడ్ సినిమా..! అన్ని కుదిరాయి కానీ అనుకోకుండా ఆగిపోయింది
చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు విశ్వంభర సినిమాతో పాటు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాకా సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. కాకా సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే విశ్వంభర సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణంలో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఉన్నాయి. అయితే, కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. అలాంటి వాటిలో ‘ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్’ ఒకటి. హాలీవుడ్ స్థాయిలో చిరంజీవిని వెండితెరపై చూపించాలనే లక్ష్యంతో మొదలైన ఈ సినిమా అప్పట్లో భారీ చర్చకు దారితీసింది. కానీ, చివరకు అనూహ్య కారణాలతో నిర్మాణం నిలిచిపోయింది. అమెరికాలో స్థిరపడిన భారతీయ నిర్మాతలు కె. రమేష్ కృష్ణమూర్తి, సుందరస్వామి, గణేష్ మహదేవన్ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో సుమారు రూ.43 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ సాంకేతిక నిపుణుల సహకారంతో సినిమాను రూపొందించాలని ప్లాన్ చేశారు. 1940లో విడుదలైన ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ చిత్ర స్ఫూర్తితో ఆధునిక సాంకేతికతను జోడించి తెరకెక్కించాలని భావించారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఏకకాలంలో నిర్మించాలనుకున్నారు. తెలుగు వెర్షన్‌కు ‘అబూ బాగ్దాద్ గజదొంగ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంగ్లీష్ వెర్షన్‌కు డచన్ గెర్సీ, తెలుగు వెర్షన్‌కు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాల్సి ఉంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేయడం మరో విశేషం. మనీషా కోయిరాలా, సషాలను కథానాయికలుగా అనుకున్నారు.
సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ వంటి కీలక విభాగాలకు హాలీవుడ్ నిపుణులను తీసుకున్నారు. 1999 ఆగస్టు 21న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్‌లో రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం రాజస్థాన్‌లో చిత్రీకరణ చేపట్టారు. ఈ సినిమాపై అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు వెర్షన్ హక్కుల కోసం బయ్యర్లు ఆసక్తి చూపించగా, దాదాపు రూ.12 కోట్ల వరకు ఆఫర్లు వచ్చినట్లు ప్రచారం జరిగింది.
అయితే, నిర్మాతల మధ్య తలెత్తిన అభిప్రాయ భేదాలు సహా పలు సమస్యల కారణంగా సినిమా నిర్మాణం ముందుకు సాగలేదు. అలా చిరంజీవి కెరీర్లో అరుదైన అంతర్జాతీయ ప్రాజెక్టుగా నిలవాల్సిన ఈ చిత్రం అసంపూర్ణంగానే మిగిలిపోయింది. సినిమా పూర్తయి విడుదలై ఉంటే, తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచేదనే అభిప్రాయం అభిమానుల్లో ఇప్పటికీ వినిపిస్తుంటుంది. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కాకా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
