
ప్రముఖ నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేరు ఎప్పుడు చిరస్థాయిగా నిలుస్తుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు చంద్రమోహన్. హీరోగా రాణించిన ఆయన ఆతర్వాత సహాయక పాత్రల్లోనూ నటించి మెప్పించారు. చంద్రమోహన్ పలు ఇంటర్వ్యూల్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సినీ జీవితం, వ్యక్తిగత అనుభవాలు, సినీ పరిశ్రమలోని కొన్ని ప్రత్యేకమైన అంశాలపై మాట్లాడారు. అలాగే దర్శకుడు కె. విశ్వనాథ్, గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంలతో తనకున్న అనుబంధాన్ని వివరంగా వెల్లడించారు. కె. విశ్వనాథ్‌తో కుటుంబ బంధం గురించి వివరిస్తూ, విశ్వనాథ్ తన సొంత పెదనాన్న కొడుకేనని, అయితే చిన్నతనంలో కుటుంబాల మధ్య అంతగా టచ్ లేకపోవడం వల్ల ఈ విషయం తనకు పరిశ్రమకు వచ్చాకే తెలిసిందని పేర్కొన్నారు.
తనతో నటించిన హీరోయిన్లు తర్వాత టాప్ పొజిషన్‌కు వెళ్తారనే ప్రచారం గురించి చంద్రమోహన్ మాట్లాడుతూ.. దీన్ని తాను కాకతాళీయంగానే భావిస్తున్నానని, ఎందుకు ఇలా జరిగిందో తనకు కూడా తెలియదని అన్నారు. భానుప్రియ, ఆమె సోదరి శాంతిప్రియ, రాధిక, విజయశాంతి, సులక్షణ, శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ తనతో కలిసి నటించారని అన్నారు. విజయశాంతి తనతో 8 సినిమాలు చేయగా, జయప్రద 6-8 సినిమాలు చేశారని, జయసుధతో అయితే ఏకంగా 25 చిత్రాల్లో కలిసి నటించానని వెల్లడించారు.
శ్రీదేవితో మాత్రం ఒక సినిమాకే పరిమితం కావాల్సి వచ్చిందని, ఆమె మొదటి సినిమా తర్వాత రామారావు, కృష్ణ వంటి అగ్ర హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగిందని, అప్పట్లో తన చిత్రాల బడ్జెట్‌కు శ్రీదేవి వంటి స్టార్ హీరోయిన్లను తీసుకోవడం కష్టమయ్యిందని చెప్పారు. అయినప్పటికీ శ్రీదేవితో సహా తనతో నటించిన అందరు హీరోయిన్లు ఎక్కడ కనిపించినా గౌరవంగా పలకరిస్తారని, ఆ బంధం ఒక సెంటిమెంట్‌గా నిలిచిందని పేర్కొన్నారు. తాను దాదాపు 40మందికి పైగా హీరోయిన్స్ ను పరిచయం చేశానని అన్నారు చంద్రమోహన్ ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. చంద్రమోహన్ 2023లో కన్నుమూశారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.