
తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కాయి. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడో 1950 ప్రాంతంలోనే పాన్ ఇండియా సినిమాకు మించిన సినిమాలు విడుదలయ్యాయి. వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో 1951లో విడుదలైన మల్లీశ్వరి సినిమా ఒకటి. మహానటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్), భానుమతిలు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. వాహిని ప్రొడక్షన్స్ పతాకంపై 1951 డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా అప్పట్లో తెలుగు సినీ ధోరణిని మార్చి, ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఎన్టీఆర్, భానుమతిల నటనా వైభవానికి, వారి మధ్య కెమిస్ట్రీకి ఈ చిత్రం మచ్చుతునకగా నిలిచింది.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. శ్రీకృష్ణదేవరాయలు హంపిని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న కాలంలో వీరాపురం అనే గ్రామంలో ప్రారంభమవుతుంది. వస్త్రాలు నేయడంలో, శిల్పాలు చెక్కడంలో, ఆటపాటల్లో నైపుణ్యం కలిగిన వారు ఎక్కువగా నివసించే ఆ గ్రామంలో నాగరాజు (ఎన్టీఆర్), మల్లీశ్వరి (భానుమతి) చిన్ననాటి నుండి అన్యోన్యంగా పెరుగుతారు. వారి ప్రేమకు మల్లీశ్వరి తల్లి భూష్యేంద్రమణి అడ్డుపడి, మల్లీశ్వరిని రాణివాసానికి పంపిస్తుంది. తనను తాను నిరూపించుకోవడానికి నాగరాజు సంపాదన కోసం బయలుదేరి, తిరిగి వచ్చేసరికి మల్లీశ్వరి రాణివాసానికి వెళ్లిన విషయం తెలుసుకుని విరహంతో దేశం విడిచి తిరుగుతాడు. శిల్పకళలో తన ప్రతిభతో పేరు సంపాదించి, శ్రీకృష్ణదేవరాయల వసంత మండపం నిర్మాణానికి ప్రధాన శిల్పిగా నియమించబడతాడు. అక్కడ అతను చెక్కిన శిల్పాల్లో మల్లీశ్వరి పోలికలను గుర్తించిన ఆమె, నాగరాజును రహస్యంగా కలుస్తుంది. చివరకు రాణి తిరుమలాంబ మధ్యవర్తిత్వంతో రాయలు వీరి ప్రేమ త్యాగాలను గుర్తించి క్షమిస్తారు. ఈ కథలోని మలుపులు, భావోద్వేగ ఘట్టాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
ఈ సినిమాకు కథతో పాటు మూవీలో ఉన్న 17 పాటల్లో 16 పాటలను దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి రాశారు. ఈ పాటలకు సాలూరు రాజేశ్వరరావు అందించిన సంగీతం సినిమాకు మరింత ప్రాణం పోసింది. నెల రాజా, వెన్నెల రాజా, మనసున మల్లెల మాలలు గానే, అవునా నిజమేనా వంటి పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. మల్లీశ్వరి పాత్రకు భానుమతిని, నాగరాజు పాత్రకు ఎన్టీఆర్ ప్రాణం పోశారు. 1951 డిసెంబర్ 20న విడుదలైన మల్లీశ్వరి అప్పట్లో 13 కేంద్రాల్లో 71 రోజులు ఏకధాటిగా ప్రదర్శితమైంది. ఇది కేవలం దేశీయంగానే కాకుండా, చైనాలో సబ్‌టైటిల్స్‌తో విడుదలై 100 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమాగా అంతర్జాతీయ రికార్డును నెలకొల్పింది. పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమై దేశ, విదేశీయుల ప్రశంసలు అందుకుంది.