
ప్రస్తుతం దక్షిణాదిలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సినిమా మంజుమ్మెల్ బాయ్స్. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఊపేస్తుంది. ఈ మూవీలోని ట్విస్టులు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నాయి. నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. కొడైకెనాల్‌లోని గుణ గుహలలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈమూవీను తెరకెక్కించారు. ఈ గుణ గుహలో చిక్కుకున్న తన స్నేహితుడిని కాపాడేందుకు ఓ యువకుడు చేసిన సాహసమే ఈ సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో అసలు గుణ గుహలు ఏంటీ ? వాటి రహస్యం ఏంటీ ? ఆ గుహల చుట్టు అల్లుకున్న మిస్టరీ ఏంటీ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ గుణ గుహల గురించి పూర్తి వివరాలు మీకు తెలుసా ?..
తమిళనాడులో ఉన్న ఈ గుణ గుహలను 1821లో బ్రిటీష్ అధికారి బిఎస్ వార్డ్ కనుగొన్నారు. వీటికి డెవిల్స్ కిచెన్ అనే పేరు పెట్టాడు. అయితే లిఖిత పూర్వకంగా ఎలాంటి రికార్డులు లేకపోయేసరికి ఈ గుహలకు ఎందుకు ఆ పేరు పెట్టారనే విషయం తెలియరాలేదు. ఆ తర్వాత ఈ గుహల చుట్టూ 1991లో కమల్ హాసన్ నటించిన గుణ సినిమాను ఈ గుహల చుట్టుపక్కనే చిత్రీకరించారు. దీంతో ఈ గుహలకు గుణ గుహలు అనే పేరొచ్చింది. అప్పటినుంచి గుణ గుహలను చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. గుణ గుహలు సముద్ర మట్టానికి 2230 మీటర్ల ఎత్తులో, షోలా చెట్లు, గడ్డితో చుట్టుముట్టి మూడు భారీ స్తంభాల రాళ్ల మధ్య ఉన్నాయి. ఈ గుహలోకి వెళ్లాలంటే ధైర్వవంతులు రాళ్లను పట్టుకొని నెమ్మదిగా వెళ్లాలి. అయితే ఈ గుహల పేరు చెబితే అక్కడి ప్రజలు భయంతో వణికిపోయేవారు. అందుకు కారణం ఆ గుహలోకి వెళ్లినవారు తిరిగి రాలేదు.
ప్రమాదకరంగా కనిపించే ఆ గుహలోకి వెళ్లేందుకు ప్రయత్నించినవారు తిరిగి రాలేదు. వారి మృతదేహాలను సైతం బయటకు తీసుకురాలేకపోయారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన గుహల్లో గుణ గుహలు ఒకటి. పోలీసుల రికార్డుల ప్రకారం 2016 వరకు దాదాపు 16 మంది ఈ గుహలోకి వెళ్లి కనిపించకుండా పోయారు. వీళ్లలో కొన్ని సూసైడ్ కేసులు కూడా ఉన్నాయట. అందులో కేవలం ఓ వ్యక్తి మాత్రమే బయటకు వచ్చాడు. అతడి జీవితం ఆధారంగానే మంజుమ్మెల్ బాయ్స్ సినిమాను తెరకెక్కించారు. 2006లో కేరళ కొచ్చి మంజుమ్మెల్ ప్రాంతానికి చెందిన కొందరు స్నేహితులు ఈ గుహలను చూసేందుకు వెళ్లారు. అందులో ఓ వ్యక్తి గుహలోకి పడిపోయాడు. అతడిని ప్రయత్నించేందుకు చాలా రకాలుగా ప్రయత్నించిన స్నేహితులు ఇక అతడిపై ఆశలు వదిలేసుకున్నారు. కానీ వారిలో సిజూ డేవిడ్ అనే వ్యక్తి మాత్రం తన స్నేహితుడిని రక్షించేందుకు వెళ్లాడు. అతి కష్టమ్మీద తన స్నేహితుడిని రక్షించుకున్నాడు. ఈ వాస్తవ ఘటన ఆధారంగానే మంజుమ్మెల్ బాయ్స్ సినిమాను రూపొందించారు.
చాలాకాలంపాటు మూసి ఉన్న ఈ గుణ గుహ సందర్శనను… ఇప్పుడు మంజుమ్మెల్ బాయ్స్ సినిమా హిట్ కావడంతో తిరిగి అనుమతించింది తమిళనాడు ప్రభుత్వం. మంజుమ్మెల్ బాయ్స్ సినిమా చాలా వరకు సెట్ లోనే చిత్రీకరించగా.. కొంత భాగం మాత్రమే గుహల చుట్టు పక్కల చిత్రీకరించారు. గతంలో మోహన్ లాల్ నటించిన షిక్కర్ (2010) సినిమా సైతం ఈ డెవిల్ కిచెన్ గుహల పరిసరాల్లోనే షూటింగ్ జరిగింది. హిందూ కథల ప్రకారం.. ఈ గుహలలోనే పాండవులు ఉండేవారని.. అక్కడే వారు వంట చేసుకునేవారని… అందుకే ఈ గుహలకు కిచెన్ అనే పెరు వచ్చిందని అంటారు. కానీ డెవిల్ అని ఎందుకు పిలిచారు అనే విషయం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.