
న్యాచురల్ స్టార్ నాని.. నేషనల్ అవార్డ్ ఫేమ్ కీర్తి సురేష్ జంటగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ దసరా. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందిస్తోన్న ఈ మూవీలో కీర్తి, నాని ఇద్దరూ పక్కా ఊర మాస్ లుక్ లో ధరణి, వెన్నెల పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా.. మరోవైపు ఈ చిత్రంలోని చమ్కీల అంగిలేసి సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ రేపు అంటే మార్చి 30న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే గత నెల రోజులుగా దసరా ప్రమోషన్స్ జోరుగా నిర్వహించారు చిత్రయూనిట్. అయితే ఈసినిమా విషయంలో సినీ ప్రియులందరికీ ఒక సందేహం మాత్రం ఉండిపోయింది. దసరా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ఇప్పటివరకు ఎక్కడా చూసిన సిల్క్ స్మిత పోస్టర్స్ కనిపిస్తున్నాయి.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఓ గోడపై సిల్క్ స్మిత పోస్టర్ ఉండగా.. అక్కడే ఉన్న అరుగుపై నాని కూర్చొని ఉన్న పోస్టర్ తెగ వైరల్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో నానితోపాటు.. ఇతర యూనిట్ సభ్యులు ధరించిన డ్రెస్ లపై దసరా టైటిల్ తోపాటు.. సిల్క్ స్మిత ఫోటో కనిపిస్తోంది. దీంతో ఇందులో నాని సిల్క్ స్మిత ఫ్యాన్ అయ్యి ఉంటాడు అనుకున్నారంతా. ఇదే విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో అడగ్గా.. అదేం లేదని.. సిల్క్ స్మిత పోస్టర్ పెట్టడానికి కారణం కేవలం దర్శకుడికి మాత్రమే తెలుసంటూ చెప్పుకొచ్చారు. తాజాగా ఇదే విషయం పై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.
దసరా సినిమాలో సిల్క్ స్మిత పోస్టర్ ఉపయోగించడానికి కారణంపై ఆయన మాట్లాడుతూ.. “చిన్నప్పుడు సింగరేణి గనుల్లో పనిచేస్తున్న సమయంలో మా తాత కాలు విరిగింది. ఆయన కోసం ప్రతిరోజు కల్లు తీసుకుని వస్తూ ఉండేవాడిని. కల్లు దుకాణం వెళ్లినప్పుడు అక్కడ మొదటి సారి సిల్క్ స్మిత పోస్టర్ చూశాను. అప్పటికే ఆమె ఒక స్పెషల్ హీరోయిన్. స్పెషల్ క్యారెక్టర్, సాంగ్స్ చేస్తుందని తెలియదు. కానీ ఆ తర్వాత ఆమె గురించి తెలుసుకుంటున్న సమయంలో ఆమె ఫోటో నా మనసులో క్లిక్ అయ్యింది. సినిమా అంటే ఆమెకు ఎంత ఇష్టమో తెలిసింది. ఇక అదే ఫోటో నేను దర్శకుడిగా అవ్వాలి అనుకున్నంత వరకు కొనసాగింది. చిన్ననాటి కల్లు దుకాణం జ్ఞాపకాలు సినిమాలో కొన్ని పెట్టే అవకాశం వచ్చింది. అందుకే సిల్క్ స్మిత పోస్టర్ ఉపయోగించాను. సినిమాలో సిల్క్ స్మిత లేకున్నా.. ఆమెకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి” అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్.