
విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన తమిళ చిత్రం ’96’ భారీ విజయాన్ని సాధించింది. ఇద్దరు మాజీ ప్రేమికులు చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోవడం, తమ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకోవడం.. ఇలా ఈ సినిమా అందరి మనస్సులను కదిలించింది. ఈ చిత్రంలోని పాటలు మరియు నేపథ్య సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశారు. జాను పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్, సమంత హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇక్కడ కూడా ఈ ప్రేమకథ సూపర్ హిట్ అయ్యింది. ఇక కన్నడలో గోల్డెన్ స్టార్ గణేష్ చేయగా అక్కడ కూడా భారీ విజయం సాధించింది. ఇప్పుడీ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల రానుంది. ’96’ సినిమా రెండవ భాగం తమిళంలో వస్తోంది, ఇది మొదటి సినిమా కథకు కొనసాగింపు కాదు. ఇది వేరే కథ, కానీ రెండు సినిమాల ఇతివృత్తం ఒకటే అవుతుంది. ’96’ రెండవ భాగంలో కూడా విడిపోయిన ప్రేమికుల కథే ఉంటుంది. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి స్థానంలో కొత్త కథానాయకుడిని ఎంపిక చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ చిత్రాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న కొత్త తరం అభిమాన కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్ ’96’ సీక్వెల్ లో కథానాయకుడిగా ఎంపికయ్యారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ’96’ సినిమా దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. దీని గురించి ఆయన సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని కూడా పంచుకున్నారు. ‘ నేను ప్రదీప్ రంగనాథన్ ని సంప్రదించిన మాట నిజమే. కానీ అది వేరే సినిమా కోసం. ’96-2′ సినిమాకి ప్రదీప్ తో ఎలాంటి సంబంధం లేదు. ’96’ సినిమాలో నటించిన నటీనటులే ’96 సీక్వెల్ లో కూడా ఉంటారు. ఈ సినిమా కథ పూర్తయిందని, వీలైనంత త్వరగా అధికారికంగా ఇతర వివరాలు ప్రకటిస్తాం’ అని దర్శకుడు పేర్కొన్నాడు.
మరోవైపు విజయ్ సేతుపతి ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ‘ట్రైన్’, ‘తలైవియన్ తలైవి’, ‘మహారాజా 2’ తదితర సినిమాలతో బిజీగా ఉన్నాడు మక్కల్ సెల్వన్. త్రిష చేతిలో కూడా చాలా సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 96 సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.