యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కెరీర్లో అతి పెద్ద చిత్రాలలో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్సిస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అయితే ఈ టీజర్ పై ముందు నుంచి విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ప్రభాస్ లుక్స్.. సైఫ్ అలీ ఖాన్ రోల్ లుక్ పై నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. తాము ఆశించినంతగా టీజర్ లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండే.. ఆదిపురుష్ సినిమా కోసం బాలీవుడ్ హీరోలను కాదని ప్రభాస్‌ను మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం పై వివరణ ఇచ్చారు డైరెక్టర్ ఓంరౌత్. ప్రభాస్ లేకుండా ఈ సినిమా వచ్చేది కాదన్నారు. ” నేను ఈ కథ రాస్తున్నప్పుడు.. ముఖ్యంగా రాముడి పాత్ర గురించి రాసేటప్పుడు నా మనసులో కేవలం ప్రభాస్ మాత్రమే ఉండేవాడు. అది నాకు చాలా కంఫర్ట్బుల్ గా అనిపించింది. ఒకవేళ ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పుకోకపోతే.. అప్పుడు ఆదిపురుష్ సినిమా వచ్చేది కాదు. అతను పోషించిన పాత్ర చాలా ప్రత్యేకంగా, దైవికంగా ఉంటుంది. ” అంటూ చెప్పుకొచ్చారు డైరెక్టర్ ఓంరౌత్.
రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపించగా.. సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల కానుంది. ఈ సినిమానే కాకుండా.. డార్లింగ్ చేతిలో సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ చిత్రాలున్నాయి.