Kalabhavan Mani: ‘జెమిని’ విలన్ గుర్తున్నాడా? చిన్నవయసులోనే ఎలా చనిపోయాడో తెలుసా? పాపం రక్తం కక్కుకుని..

కళాభవన్ మణి .. ఈ పేరు వింటే చాలా మంది గుర్తు పట్టకపోవచ్చు.. కానీ విక్టరీ వెంకటేష్ 'జెమిని' సినిమా విలన్ అంటే ఇట్టే గుర్తు పడతారు. ఇందులో ఆయన నటన, ఎక్స్ ప్రెషన్స్ తెలుగు ఆడియెన్స్ కు తెగ నచ్చేశాయి.

Kalabhavan Mani: జెమిని విలన్ గుర్తున్నాడా? చిన్నవయసులోనే ఎలా చనిపోయాడో తెలుసా? పాపం రక్తం కక్కుకుని..
Tollywood Actor

Updated on: Jun 07, 2026 | 12:12 PM

కళాభవన్ మణి అసలు పేరు రామన్ మణి. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని చలకుడిలో పుట్టి పెరిగాడు. చిన్నప్పటి నుంచే మణికి కళలంటే విపరీతమైన ఇష్టం. ఆ ఆసక్తితోనే ప్రముఖ స్టేజ్ గ్రూప్ అయిన ‘కళాభవన్’లో చేరాడు. అక్కడి నుంచే ఆయన పేరు కళాభవన్ మణిగా మారిపోయింది. ఈ గ్రూప్ లో మణి పాటలు పాడేవారు. మిమిక్రీ చేసేవాడు. డ్యాన్స్ కూడా చేసేవాడు. ఇంతటి ట్యాలెంట్ ఉన్న మణి సినిమా ఇండస్ట్రీలోకి కూడా త్వరగానే వచ్చాడు. మొదటి సారిగా తమిళంలో ‘కెప్టెన్ ప్రభాకరన్’ అనే సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. ఆతర్వాత ఒక మలయాళ సినిమాతో హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కమెడియన్ గానూ, విలన్ గానూ, సహాయక ఆర్టిస్టుగానూ ఆకట్టుకున్నారు. సినిమాలో ఏ రోల్ ఇచ్చినా సరే అందులో ఒదిగిపోవడం మణికి అలవాటు. అందుకే చాలా తక్కువ సమయంలోనే ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి కేరళ నటుడిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.

కాగా మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లోనూ నటించారు కళాభవన్ మణి. విక్టరీ వెంకటేష్, ఎన్టీఆర్, రాజశేఖర్, మహేష్ బాబు, శ్రీకాంత్, రజనీకాంత్, కమలహాసన్, విజయ్, సూర్య, విక్రమ్, శింబు, మాధవన్ ఎంతో మంది స్టార్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా ప్లే బ్యాక్‌ సింగర్‌గానూ టాలెంట్‌ చూపించారు మణి. ఇలా సినిమా ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న మణి మద్యం అలవాటుతో తన చావును తనే కొని తెచ్చుకున్నాడంటారు ఇండస్ట్రీలో.

2016 మార్చి 3న తన చలకుడి ఫామ్‌హౌస్‌లో అపస్మార స్థితిలో కనిపించారు కళాభవన్ మణి. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. కొద్ది సేపటికే ఆయన కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు కేవలం 45 ఏళ్లు మాత్రమే. అయితే మణి మరణంపై పలు రూమర్లు వచ్చాయి. ఆయనంటే గిట్టని వారు విషం ఇచ్చి చంపారని ప్రచారం జరిగింది. కానీ అధికారిక దర్యాప్తులో మాత్రం మణి మరణానికి కారణం అతిగా మద్యం సేవించడమేనని తేలింది. ఈ కేసును దర్యాప్తు చేసిన ప్రముఖ ఐపీఎస్ అధికారి ఉన్నిరాజన్ కళాభవన్ మణి మరణానికి గల కారణాలను ఇలా చెప్పుకొచ్చారు. ‘మణికి విపరీతమైన తాగుడు అలవాటు ఉంది. కాలేయం పూర్తిగా పాడై పోయినా ఆయన మద్యం తాగడం ఆపలేదు. మరణించిన రోజు కూడా ఆయన భారీగా మద్యం తీసుకున్నారు. శవ పరీక్షలో కూడా మిథైల్ ఆల్కహాల్ ఉన్నట్లు తేలింది’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us