
ప్రస్తుతం దేశమంతటా ధురంధర్ మేనియాతో ఊగిపోతోంది. రణ్ వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురందర్ ది రివేంజ్ సినిమాకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం తదితర ప్రముఖ భాషల్లోనూ ధురంధర్ 2 సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. మార్చి 19న విడుదలైన ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 750 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ నేపథ్యంలో ‘రియల్ ధురంధర్’ గా రవీంద్ర కౌశిక్ పేరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పాక్ ఆర్మీలో మేజర్ స్థాయికి ఎదిగిన ఆయన మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో ‘బ్లాక్ టైగర్’ అనే బిరుదు పొందాడు. మరి ఈ రవీంద్ర కౌశిక్ ఎవరు? ఆయన ప్రయాణమేంటి? తదితర విషయాలను తెలుసుకుందాం రండి.
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో రవీంద్ర కౌశిక్ జన్మించారు. ఇతని ధైర్యం, తెగింపు చూసిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) అతనికి ఢిల్లీలో రెండు సంవత్సరాల పాటు కఠిన శిక్షణ ఇచ్చింది. దీని తర్వాత అతను నబీ అహ్మద్ షకీర్ పేరుతో 1975లో సరిహద్దు దాటి.. పాక్‌లోకి ప్రవేశించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. కరాచీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో డిగ్రీ సంపాదించిన రవీంద్ర కౌశిక్ ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యంలో చేరారు. తన టాలెంట్‌తో ఏకంగా మేజర్ హోదాను పొందారు. 1979 నుంచి 1983 మధ్య దాదాపు 4 ఏళ్ల పాటు కౌశిక్ పాక్ ఆర్మీకి సంబంధించిన సీక్రెట్స్ ను భారతదేశానికి పంపాడు. పంజాబ్‌లోని సైనిక కదలికలు.. కహుటాలోని పాకిస్తాన్ అణు కర్మాగారం గురించి కీలకమైన వివరాలను భారతదేశానికి చేరవేశాడు. ఇదే క్రమంలో అమానత్ అనే పాకిస్తానీ మహిళను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ బిడ్డ కూడా పుట్టింది.
ఆ ఒక్క తప్పిదంతో
1983లో రా సంస్థ ఇనాయత్ మసీహ్ అనే జూనియర్ స్పైని.. రవీంద్ర కౌశిక్ ను కలవడానికి పంపింది. కానీ మసీహ్ అక్కడి ఐఎస్ఐకి దొరికిపోయాడు. మసీహ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా 1983 సెప్టెంబర్‌లో రవీంద్ర కౌశిక్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత అతనిని సియాల్‌కోట్‌లో విచారించి.. కోట్ లఖ్‌పత్, మియాన్‌వాలి లాంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల జైళ్లకు తరలించారు. 1985లో పాకిస్తానీ సైనిక న్యాయస్థానం రవీంద్రకు మరణశిక్ష విధించింది. కానీ ఆ తరువాత దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. సుమారు 18 ఏళ్లపాటు జైల్లోనే మగ్గిన రవీంద్ర చివరకు ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులతో 2001, నవంబర్ 21న మియాన్‌వాలీ జైలులో తుదిశ్వాస విడిచారు. ఆయన చివరి గుర్తులు కూడా ఎవరూ గుర్తించలేని విధంగా జైలు వెనక ఖననం చేశారు. చూశారుగా ..సినిమా కథకు ఏ మాత్రం తగ్గని జీవితం రవీంద్ర కౌశిక్ ది. ధురంధర్ సినిమా రిలీజ్ వేళ.. ఈ రియల్ ధురంధర్ స్టోరీ హృదయాలను బరువెక్కిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.