
ఢీ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న అతి తక్కువ మందిలో నైనిక ఒకరు. ఈ అమ్మడు తన డాన్స్ తో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది.. అలాగే టీవీ షోలతో క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకుంది ఈ అమ్మడు. బిగ్ బాస్ ఈ ముద్దుగుమ్మ ఉన్నది కొన్ని వారాలే కానీ తన ఆటతో ఆకట్టుకుంది నైనిక.. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ చిన్నది పలు ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. నైనిక తన తండ్రి గురించి షాకింగ్ విషయం పంచుకుంది. ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఓ ఇంటర్వ్యూలో నైనిక మాట్లాడుతూ.. తన తల్లికి సెలూన్ వ్యాపారం ఉందని తెలిపింది. తన తండ్రి దూరమైన తర్వాత తల్లి తనకు మంచి జీవితాన్నిస్తానని, ఇల్లు కడతానని మాట ఇచ్చిందని నైనిక చెప్పుకొచ్చింది. ఒడిశాలో సొంతంగా మూడు నుంచి నాలుగు అంతస్తుల భవనాన్ని కట్టామని, దాని నుండి అద్దె వచ్చేదని తెలిపింది. అయితే, నైనికకు హైదరాబాద్‌లో సినీ రంగంలో అవకాశాలు వస్తున్న నేపథ్యంలో, ఆమె ఒంటరిగా అక్కడ ఉండటం సరికాదని భావించిన తల్లి, ఆ ఆస్తిని అమ్మి, ఆ డబ్బుతో హైదరాబాద్‌లో ఒక స్టూడియో స్థాయిలో సెలూన్‌ను ప్రారంభించారని నైనిక చెప్పింది. తన తండ్రి గురించి మాట్లాడుతూ, ఆయన దురుసుగా ప్రవర్తించేవారని, మద్యం అలవాటు ఉందని, కొట్టేవాడని నైనిక తెలిపింది. నైనికకు ఐదేళ్ల వయసున్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారని తెలిపింది. ఆ తర్వాత తండ్రితో ఎప్పుడూ సంబంధాలు లేవని, ఆయన ప్రేమ ఎలా ఉంటుందో తనకు తెలియదని ఆమె చెప్పుకొచ్చింది.
తన 13వ ఏట తండ్రి తిరిగి వచ్చినా, ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదని, మళ్లీ మద్యం తాగి తల్లిని పిచ్చి పిచ్చిగా కొట్టడం మొదలుపెట్టడంతో, ఇంట్లో ఆయన ఉండకూడదని తనే గట్టిగా చెప్పానని తెలిపింది. ఆ తర్వాత ఆయన తమ జీవితం నుండి పూర్తిగా దూరమయ్యారని, అప్పటి నుండి ఆయన అవసరం తమకు రాలేదని నైనిక స్పష్టం చేసింది. ఇంట్లో ఒక పెద్ద దిక్కు ఉండాలని చాలా మంది అంటారని, అయితే తమ జీవితం ఒక అద్భుతంలా సాగిందని నైనిక చెప్పింది. తన మామయ్య (తల్లి సోదరుడు) వారికి అన్ని విధాలా అండగా ఉన్నారని, ఆయన ఒక సోదరుడిలా తల్లికి, మామయ్యలా తనకు సహాయపడ్డారని తెలిపింది. తాను ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు కూడా తన తల్లి తోడుగా ఉండేవారని, పురుషుల అండ లేకుండానే తాము ఇంత దూరం వచ్చామని నైనిక చెప్పుకొచ్చింది. సినిమా చూసినప్పుడు గానీ, ఇతరుల తండ్రులను చూసినప్పుడు గానీ, తనకు తండ్రి ఉంటే బాగుండు అని ఎప్పుడూ అనిపించదని, ఎందుకంటే తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తనకు తెలియదని తెలిపింది నైనిక. అయితే, సినీ పరిశ్రమలో రాత్రిపూట ప్రయాణాలు లేదా కొత్త వ్యక్తులను కలిసినప్పుడు ఒక తండ్రి అండ, భద్రత లేని లోటు కనిపిస్తుందని, ఆ భద్రత ఉంటే ఎవరినైనా ఎదుర్కోగలమని నైనిక చెప్పుకొచ్చింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.