టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత ఉంది కానీ హీరోలకు మాత్రం కొరతే లేదు.. ఒక్కరో ఇద్దరో కాదు దాదాపు అర డజన్ మంది స్టార్ హీరోలు.. డజన్ మంది మీడియం రేంజ్ హీరోలున్నారు. వాళ్లే ఫుల్ బిజీగా ఉంటారెప్పుడూ. అలాంటిదిప్పుడు ఉన్న వాళ్లు సరిపోవట్లేదంటూ పక్క ఇండస్ట్రీకి వెళ్లి కథలు చెప్పి వాళ్లనిక్కడికి తీసుకొస్తున్నారు దర్శకులు. తాజాగా ఇద్దరు హీరోలైతే టాలీవుడ్‌పై సీరియస్‌గా ఫోకస్ చేసారు. మన తెలుగు ఆడియన్స్ మహా మంచోళ్లబ్బా.. ఒక్కసారి నచ్చారంటే చాలు నెత్తిన పెట్టుకుంటారు.. వాళ్లు మన ఇండస్ట్రీనా కాదా అని కూడా చూడరు. దుల్కర్ సల్మాన్‌కు ఇప్పుడిలాంటి ప్రేమే టాలీవుడ్‌లో దక్కింది. మహానటి, సీతారామం లాంటి సినిమాలతో మన ఆడియన్స్‌కి బాగా చేరువైపోయారు దుల్కర్. తాజాగా లక్కీ భాస్కర్ అంటూ మూడో తెలుగు సినిమాకు ముహూర్తం పెట్టారీయన.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ సినిమాను నిర్మించిన సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్, శిఖర స్టూడియోస్ దుల్కర్ సల్మాన్ సినిమాను నిర్మిస్తున్నారు. జులై 28న దుల్కర్ బర్త్ డే సందర్భంగా లక్కీ భాస్కర్ టైటిల్ పోస్టర్ విడుదల చేసారు. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. మరోవైపు ధనుష్ సైతం సార్ తర్వాత టాలీవుడ్‌ను సీరియస్‌గా తీసుకున్నారు. ఈయన తాజాగా శేఖర్ కమ్ముల సినిమా ప్రకటించారు.
సార్ బ్లాక్‌బస్టర్ కావడం.. దానికి ముందు కూడా కొన్ని సినిమాలు తెలుగులో బాగానే ఆడటంతో ఇక్కడి దర్శకులపై ఫోకస్ చేస్తున్నారు ధనుష్. శేఖర్ కమ్ములతో ఎప్పట్నుంచో వార్తల్లో ఉన్న ప్రాజెక్ట్ ఇప్పుడు పట్టాలెక్కింది. అలాగే కెప్టెన్ మిల్లర్ ప్రమోషన్స్ కూడా తెలుగులో బాగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మొత్తానికి ఓ వైపు దుల్కర్ సల్మాన్.. మరోవైపు ధనుష్ తెలుగు ఇండస్ట్రీపై దండయాత్రకు సిద్ధమవుతున్నారు.