Deepika Padukone: ‘మీ క్లారిటీతో మరింత దిగజారారు’.. ఎల్ అండ్ టీ కంపెనీ వివరణపై దీపిక సంచలన పోస్ట్

|

Jan 10, 2025 | 1:34 PM

ఎల్ అండ్ టీ అధినేత ఎస్.ఎన్. సుబ్రమణియన్ సూచించిన 90 గంటల పని ప్రతిపాదనపై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలువుర సినిమా సెలబ్రిటీలు కూడా ఎల్ అండ్ టీ ఛైర్మన్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకొణె ఇప్పటికే సుబ్రమణియన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Deepika Padukone: మీ క్లారిటీతో మరింత దిగజారారు.. ఎల్ అండ్ టీ కంపెనీ వివరణపై దీపిక సంచలన పోస్ట్
S N Subrahmanyan, Deepika Padukone
Follow us on

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె మానసిక ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. మనం ఏం చేసినా మానసిక ఆరోగ్యం బాగుండాలని తరచూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తుంటుందీ అందాల తార. గతంలో డిప్రెషన్ బారిన పడిన దీపిక ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పి పలువురికి అవగాహన కల్పించింది. ఈ క్రమంలోనే ‘ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలి’ అని ఇప్పుడు ఎల్ అండ్ టీ సంస్థ అధినేత ఎస్.ఎన్. సుబ్రమణియన్ చేసిన ప్రకటనపై దీపిక స్పందించింది. ‘ఆదివారాలు కూడా మీరు పని చేయలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. నేను ఆదివారం కూడా పని చేస్తాను. నువ్వు కూడా ఆదివారం పని చేస్తే మరింత సంతోషిస్తాను. ప్రతి ఉద్యోగి వారానికి 90 గంటలు పని చేయాలి’ అని సుబ్రమణియన్ ఇటీవల చెప్పుకొచ్చారు. ‘ అంతేకాదు ఎప్పుడూ ఇంట్లో ఉంటూ ఏం చేస్తావు? ఎంతసేపు భార్య ముఖం చూస్తూ ఉంటావు? అని కాస్త వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ కామెంట్స్ పై దీపిక విమర్శలు గుప్పించింది. ‘ఇంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రకటన చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది’ అని ఇన్ స్టా స్టోరీస్‌ లో ఒక పోస్ట్ పెట్టింది దీపిక. దీనికి #mentalhealthmatters అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జోడించింది. తద్వారా మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని చెప్పుకొచ్చింది దీపిక.

దీపికా మాత్రమే కాకుండా పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో సుబ్రహ్మణ్యం కామెంట్స్ పై విమర్శలు గుప్పించారు. తమ కంపెనీపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ఎల్ అండ్ టీ కంపెనీ టీమ్ స్పందించింది. తమ అధినేత కామెంట్స్ పై వివరణ ఇస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘ దేశ నిర్మాణమే మా ప్రధాన లక్ష్యం. ఎనిమిది దశాబ్దాలకు పైగా మేము భారతదేశ మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరుస్తున్నాం. ఇది భారతదేశ దశాబ్దమని మేం భావిస్తున్నాము. అందువల్ల దేశం పురోగతిని ప్రోత్సహించడానికి, అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే మన దృష్టిని సాకారం చేసుకోవడానికి సమిష్టి అంకితభావం అవసరం. మన రాష్ట్రపతి ప్రసంగం ఈ గొప్ప ఆశయాన్ని ప్రతిబింబించింది. ఎందుకంటే అసాధారణ ఫలితాలు రావాలంటే అసాధారణ ప్రయత్నాలు అవసరం. ఈ విస్తృత లక్ష్యాన్నే ఛైర్మన్‌ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తాయ’ని కంపెనీ ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చారు.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ క్లారిఫికేషన్ పోస్ట్‌ను పంచుకుంటూ దీపిక తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘.. ఈ క్లారిటీ ఇచ్చి మరింత దిగజారారు’ అని క్యాప్షన్ ఇచ్చింది. జర్నలిస్ట్ ఫాయే డిసౌజా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో కంపెనీ పోస్ట్‌ను పంచుకున్నారు. నెటిజన్లు కూడా తమ కామెంట్ బాక్స్‌లో ఎల్‌అండ్‌టి కంపెనీపై విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.