రేణుకా స్వామి హత్య కేసులో ఏడుగురు నిందితులకు కర్ణాటక రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులు ఏ1 పవిత్ర గౌడ, ఏ2 దర్శన్‌లకు కూడా బెయిల్ లభించింది. దర్శన్ ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై బయట ఉన్నాడు. అయితే పవిత్రగౌడ్ గత ఆరు నెలలుగా పరప్ప అగ్రహార జైలులో గడుపుతున్నారు. శుక్రవారం (డిసెంబర్ 13) జరిగిన బెయిల్ పిటిషన్ విచారణలో నిందితురాలు పవిత్ర గౌడ తరఫున సీనియర్ న్యాయవాది సెబాస్టియన్ వాదించారు. పవిత్ర గౌడ సింగిల్ పేరెంట్ అని, ఆమె మహిళ అని, ఈ కేసులో ఆమెకు ఎలాంటి పాత్ర లేదని చెప్పారు. ఆమె రేణుకా స్వామి అపహరణకు గానీ, హత్యకు గానీ సహకరించలేదని న్యాయమూర్తికి తెలియజేశారు. ‘పవిత్ర సింగిల్ పేరెంట్ లేదా మహిళ అనే విషయాన్ని కోర్టు పరిగణించలేదని, బదులుగా, కేసులో ఆమె పాత్ర లేనందున ఆమెకు బెయిల్ మంజూరు చేసింది’ అని న్యాయవాది మీడియాతో చెప్పుకొచ్చారు. ‘కోర్టు ఎలాంటి షరతులు విధించిందో తెలియదు. పవిత్ర గౌడను సోమవారం విడుదల చేసే అవకాశం ఉందని కోర్టు ఆదేశించిన తర్వాతే సమాచారం అందుతుంది’ అని లాయర్ తెలిపారు. ఇదే సందర్భంగా పవిత్రగౌడ్ తల్లి మాట్లాడుతూ.. ‘నా కుమార్తెకు బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు.
కాగా పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆరోపణతో రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి బెంగళూరులో చిత్రహింసలకు గురిచేశారు. తరువాత అతనిని దారుణంగా హత్య చేశారు. అనంతరం అతని మృతదేహాన్ని కాలువలో పడేశారు. ఈ కేసుకు సంబంధించి జూన్ నెలలో దర్శన్, పవిత్రగౌడ్, నాగరాజ్, జగదీష్ తదితరులను అరెస్ట్ చేశారు. కాగా కొన్ని రోజుల క్రితం అనారోగ్య కారణాలతో గతంలో దర్శన్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ రావడంతో ఆయనకు పెద్ద ఊరట లభించినట్లయింది.ఇక ఇదే హత్య కేసులో ఏ1 పవిత్ర గౌడకు బెయిల్ లభించింది. ఆమె 180 రోజులకు పైగా పరప్ప అగ్రగర జైలులో ఉన్నారు. వీరితో పాటు నాగరాజ్, లక్ష్మణ్, ప్రదోష్, జగదీష్, అనుకుమార్‌లకు కూడా హైకోర్టు కోర్టుబెయిల్ మంజూరు చేసింది.
దర్శన్ అండ్ గ్యాంగ్ కు బెయిల్ మంజూరు కావడంపై రేణాకస్వామి తండ్రి కాశీనాథయ్య స్పందించారు. ‘న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. బెయిల్ మంజూరు విషయం మీడియాకు ముందే తెలుసు. విచారణ అనంతరం న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. నిందితులకు తాత్కాలికంగా బెయిల్ మంజూరు చేయవచ్చు. కానీ చివరకు నిందితులకు శిక్ష పడుతుందన్న నమ్మకం ఉంది’ అని ఆయన చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి