Prem Rakshit: ఆర్థిక కష్టాల నుంచి ఆస్కార్ వరకు.. ‘నాటు నాటు’ సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ సినీ ప్రయాణం..

తారక్, చరణ్ కలిసి చేసిన సిగ్నేచర్ స్టెప్స్ తెగ ఫేమస్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టి ప్రేమ్ రక్షిత్ వైపు మళ్లింది. స్టార్ హీరోస్, రాజమౌళితో పాటు.. ప్రేమ్ రక్షిత్ పేరు కూడా మారుమోగింది.

Prem Rakshit: ఆర్థిక కష్టాల నుంచి ఆస్కార్ వరకు.. 'నాటు నాటు' సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ సినీ ప్రయాణం..
Choreographer Prem Rakshit
Follow us

|

Updated on: Mar 20, 2023 | 3:58 PM

ప్రపంచస్థాయిలో ఆర్ఆర్ఆర్ చిత్రం సంచలనం సృష్టించింది. రాజమౌళి రూపొందించిన ఈ సినిమాకు విదేశీయులు.. హాలీవుడ్ డైరెక్టర్స్ ముగ్దులయ్యారు. విశ్వవేదికపై ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్ అందుకుని చరిత్ర సృష్టించింది. ఇటీవల లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలలో ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ కేటగిరిలో ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డ్ ను మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ అందుకున్నారు. సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాటకు ప్రధాన ఆకర్షణ ఆయన చేసిన కొరియోగ్రఫీనే. ముఖ్యంగా తారక్, చరణ్ కలిసి చేసిన సిగ్నేచర్ స్టెప్స్ తెగ ఫేమస్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టి ప్రేమ్ రక్షిత్ వైపు మళ్లింది. స్టార్ హీరోస్, రాజమౌళితో పాటు.. ప్రేమ్ రక్షిత్ పేరు కూడా మారుమోగింది.

ఇటీవల ఆస్కార్ అవార్డ్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రేమ్ రక్షిత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాను ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డానని.. కానీ రాజమౌళి వరుసగా తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చారని అన్నారు. “నేను కృష్ణానగర్ నుంచి వచ్చినవాడిని. అక్కడి కష్టాలను చూసినవాడిని. రాజమౌళి ఇంట్లో కార్తికేయ.. కాలభైరవ.. సింహాలకు డాన్స్ నేర్పేవాడిని. మరో ఇద్దరు కుర్రాళ్ల ఇళ్లకు కూడా వెళ్లి క్లాసులు తీసుకునేవాడిని. అలా వచ్చిన డబ్బుతోనే అతి కష్టం మీద రోజులు గడుపుతూ వెళ్లేవాడిని” అని అన్నారు.

“రాజమౌళి గారు వరుస అవకాశాలు ఇచ్చారు. సై.. చత్రపతి.. విక్రమార్కుడు.. మగధీర.. ఇలా అన్ని సినిమాలకు పనిచేస్తూ వచ్చాను. నాటు నాటు పాటను అటు ఎన్టీఆర్, ఇటు చరణ్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని కంపోజ్ చేయవలసి వచ్చింది. ఈ పాటకు ఆస్కార్ అవార్డ్ ప్రకటించినప్పుడు మా అందరికీ మాట రాలేదు. కళ్ల వెంట నీళ్లు వస్తూనే ఉన్నాయి. నిజంగా ఈ పాట కోసం తారక్, చరణ్ చాలా కష్టపడ్డారు” అంటూ చెప్పుకొచ్చారు.