మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ కొణిదెల పుట్టిన రోజు నేడు. భార్య పుట్టిన రోజు సందర్భంగా చిరు ప్రత్యేకంగా విష్ చేశారు. ఏకంగా కవితే చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘నా జీవన రేఖ..నా సౌభాగ్య రేఖ..నా భాగస్వామి సురేఖ !’అంటూ ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం అమెరికా ట్రిప్పులో ఉన్న చిరు భార్య పుట్టిన రోజు కోసమే ఈ ట్రిప్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మెగా కోడలు ఉపాసన కూడా అత్తమ సురేఖ బర్త్‌డేకు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ‘ఆతమ్మాస్ కిచెన్’ పేరుతో జాయింట్ ఆన్‌లైన్ బిజినెస్ వెంచర్ ప్రారంభించారు. ఇది రెడీ టు ఈట్ ఫుడ్ బిజినెస్. ఈ విషయాన్ని ఉపాసన స్వయంగా తెలిపారు.
ఈ రోజు అత్తమ్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా మా వ్యవస్థాపక వెంచర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. సంప్రదాయానికి అనుగుణంగా రుచి ఉన్న వంటశాలలో బంధాలు తరతరాలుగా నిర్మించబడతాయి. ఇప్పుడు మా వంటగది నుంచి మీ వద్దకు రెడీ మిక్స్ రూపంలో కొన్ని ఆహార ప్రాడక్ట్స్ వస్తున్నాయి. మీరు కూడా మీ ఇంట్లోనే వీటిని ఆస్వాదించండి’ అంటూ ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రొడక్ట్స్ అన్నీ athammaskitchen.com అనే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి ఉప్మా, పొంగల్, పులిహార, రసం..ఈ 4 ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఈ నాలుగు ప్యాకెట్ల ధర రూ. 1,099 ఉంది. ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించి వీటిని పొందవచ్చు. ప్రపంచంలో ఏ మూల ఉన్నా తమ ఆహార ఉత్పత్తులు అందుతాయని తెలుపుతూ ఇన్‌స్టా వేదికగా ఉపాసన ఓ వీడియో విడుదల చేశారు. చిరు సతీమణి సురేఖ చేతి వంటలు మీరూ రుచి చూడండి.
చిరంజీవి తల్లి అంజనమ్మ, సురేఖతో సహా వారి కుటుంబంలో దాదాపు అందరూ పాకశాస్త్ర నిపుణులే. ఇప్పటి వరకూ సోషల్ మీడియా వీడియోల ద్వారా వారి వంట నైపుణ్యాలను చూశాం. ఇప్పుడు మనం వాటిని రుచి కూడా చూడబోతున్నాం. ఉపాసన బిజినెస్ నైపుణ్యాలు, సురేఖ పాకశాస్త్ర నైపుణ్యం కలయికలో తాజా వెంచర్‌ను ప్రారంభించారు. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఆహార ప్రియులందరూ మెగా ఫ్యామిలి తయారుచేసే ఉత్పత్తులను రుచి చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
కాగా అత్తమ్మాస్ కిచెన్ అత్తమ్మాస్ కిచెన్ అనేది తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న ఒక వినూత్నమైన రెడీ మిక్స్ ఫుడ్ ఆహార వ్యాపారం. వీరి కంపెనీ నుంచి దక్షిణ భారత దేశ వంటకాలలో ముఖ్యమైన వాటిని ఆన్‌లైన్ ద్వారా అందించనున్నారు. ప్రామాణికమైన, రుచికరమైన, హోమ్‌లీ వంటకాలను అందించనున్నందుకు మేము గర్విస్తున్నాం. ఎప్పుడైన ప్రయాణంలో ఉన్నప్పుడు ఇంటి ఫుడ్ తినాలనుకుంటే ఇప్పుడు మరింత సులువు. అత్తమ్మాస్ కిచెన్ ద్వారా మా ఇంటి ఫుడ్ మీ ఇంటికి చేరుతుందని ఉపాసన చెప్పుకొచ్చారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.