Thalapathy Vijay: దళపతి విజయ్‌పై కేసు పెట్టిన అభిమాని.. ఏం జరిగిందంటే? వైరల్ వీడియో

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన మధురైలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహించారు. తమిళనాడు నలు మూలల నుంచి లక్షలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు విజయ్ సభకు తరలి వచ్చారు.

Thalapathy Vijay: దళపతి విజయ్‌పై కేసు పెట్టిన అభిమాని.. ఏం జరిగిందంటే? వైరల్ వీడియో
Thalapathy Vijay

Updated on: Aug 27, 2025 | 10:56 AM

దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని ఇది వరకే విజయ్ ప్రకటించాడు. ఈ క్రమంలోనే విజయ్ తన పార్టీ రెండవ బహిరంగ సభను మధురైలో నిర్వహించారు. ఆగస్టు 21న జరిగిన ఈ సభకు తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. యువత, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సభా వేదిక దగ్గరకు వెళ్లేందుకు ఒక ర్యాంప్ కూడా నిర్మించారు. తన కోసం వచ్చిన వారికి అభివాదం చేస్తూ ఈ ర్యాంప్‌పై నడుచుకుంటూ వెళ్తూ వేదిక దగ్గరకు చేరుకున్నాడు విజయ్. అయితే ఆయన వేదిక దగ్గరకు వెళుతుండగా చాలా మంది ర్యాంప్ ఎక్కి విజయ్ దగ్గరికి రావడానికి ప్రయత్నించారు. అయితే బౌన్సర్లు వారిని అడ్డుకున్నారు. కొందరిని ర్యాంప్ నుంచి కిందకు తోసేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సమావేశం తర్వాత, శరత్‌కుమార్ అనే యువకుడు పెరంబలూరు ఎస్పీ కార్యాలయంలో హీరో విజయ్ తో పాటు ఆయన బౌన్సర్లపై ఫిర్యాదు చేశాడు. విజయ్, అతని బౌన్సర్లు తనపై దాడి చేసి గాయపరిచారని శరత్ పోలీస్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

శరత్ కుమార్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పెరంబలూరు ఎస్పీ కేసును మధురైలోని కున్నం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. విజయ్ తో సహా మొత్తం పది మంది బౌన్సర్లపై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా విజయ్ బహిరంగ సభ సమయంలో భారీ తొక్కిసలాట జరిగింది. ముఖ్యంగా ప్రజలు వేదికపైకి ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు, వారిని ఆపడానికి బౌన్సర్లు కొందరిపై దాడి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

వైరలవుతోన్న వీడియోలు ఇవే..

ఇక సినిమాల విషయానికి వస్తే.. దళపతి విజయ్ ఇప్పుడు తన 69వ చిత్రం ‘జన నాయగన్’ సినిమా షూటింగులో బిజీగా ఉంటున్నాడు. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 9, 2026న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం గతంలో ప్రకటించింది.