Vijay Deverakonda: చిక్కుల్లో హీరో విజయ్‌ దేవరకొండ.. రాయదుర్గం పీఎస్‌లో కేసు.. కారణమిదే

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్ డమ్ సినిమాతో బిజీగా ఉంటున్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటోంది.

Vijay Deverakonda: చిక్కుల్లో హీరో విజయ్‌ దేవరకొండ.. రాయదుర్గం పీఎస్‌లో కేసు.. కారణమిదే
Vijay Deverakonda

Updated on: Jun 22, 2025 | 2:48 PM

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. తాజాగా అతనిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 26వ తేదీన రాయదుర్గం జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన రెట్రో సినిమా ప్రీరిలీజ్‌ వేడుకకు హీరో విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతను ప్రసంగిస్తూ గిరిజనులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు గిరిజనులను అవమానపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘం నాయకుడు అశోక్‌కుమార్‌ రాథోడ్‌ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హీరో విజయ్‌ దేవరకొండపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీంతో మాదాపూర్‌ ఏసీపీ శ్రీధర్‌ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హీరో వ్యాఖ్యలపై విచారణ జరిపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రెట్రో సినిమాలో పహల్గాం ఉగ్రదాడి గురించి మాట్లాడిన విజయ్ దేవరకొండ .. ‘ ఇండియా పాకిస్తాన్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదు.. అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్‌ ప్రభుత్వంపై తిరగబడతారు. 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్‌ కొట్టుకున్నట్లు.. బుద్ధి లేకుండా, కనీస కామన్‌ సెన్స్‌ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. మనమంతా ఐకమత్యంగా ఉండాలి’ అని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు గిరిజనులను అవమానపరిచేలా ఉన్నాయని, గిరిజన సంఘం నాయకుడు అశోక్‌కుమార్‌ రాథోడ్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తన మాటలపై నెగెటివ్ కామెంట్స్ రావడంతో విజయ్ కూడా అప్పుడే స్పందించాడు. తాను ట్రైబ్స్‌ అనే పదం వాడిన మాట నిజమే కానీ.. దాని అర్థం గిరిజనులు కాదని వివరణ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

 అప్పుడే క్షమాపణలు చెప్పినా..

‘వందల ఏళ్ల క్రితం  రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు, గొడవలు చోటు చేసుకునేవి. ఆ సెన్స్‌లోనే ట్రైబ్స్‌ అనే పదం వాడాను. అంతేకానీ, ఇప్పుడున్న షెడ్యూల్‌ ట్రైబ్‌ని ఉద్దేశించి నేను ఈ వ్యాఖ్యలు చేయలేదు. అయినా కూడా నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకొని హర్ట్ అయితే అందుకు నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని అప్పుడే సోషల్‌ మీడియా వేదికగా వివరణ ఇచ్చాడు విజయ్. అయినా ఇప్పుడు విజయ్ పై కేసు నమోదు కావడం అతని ఫ్యాన్స్‌ ను షాక్ కు గురి చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.