AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు ఇంట్లో బాలయ్య చిత్రం షూటింగ్.. ఆ మూవీ ఏంటో తెలుసా..?

నందమూరి బాలకృష్ణ 50వ చిత్రంగా నారీ నారీ నడుమ మురారి అనూహ్య విజయం సాధించింది. మాస్ ఇమేజ్‌కు భిన్నంగా, ఫైట్స్ లేని పూర్తి కుటుంబ కథా చిత్రంగా ఇది బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కథ, బాలకృష్ణ నటన, కేవీ మహదేవన్ సంగీతం ఈ సినిమా విజయానికి కీలకమయ్యాయి. ఈ చిత్రం బాలయ్య కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది.

చిరు ఇంట్లో బాలయ్య చిత్రం షూటింగ్.. ఆ మూవీ ఏంటో తెలుసా..?
Chirnajeevi Balakrishna
Ram Naramaneni
|

Updated on: Jul 23, 2026 | 3:52 PM

Share

నందమూరి బాలకృష్ణ సినిమాలంటే అదిరిపోయే స్టెప్స్‌తో కూడిన మాస్ సాంగ్స్, ఒళ్ళు గగుర్పొడిచే థ్రిల్లింగ్ ఫైట్స్, తనదైన శైలిలో పంచి డైలాగులు అనే అభిప్రాయం ఉంటుంది. అయితే, ఈ మాస్ ఫార్ములాకు పూర్తిగా విరుద్ధంగా, ఎలాంటి ఫైట్స్ లేకుండానే రూపొంది బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రంగా నారీ నారీ నడుమ మురారి నిలిచిపోయింది. ఇది బాలకృష్ణ కెరీర్‌లో 50వ సినిమా కావడం ఒక విశేషం. అప్పటికే అగ్రతారగా, తిరుగులేని మాస్ ఇమేజ్‌తో ఉన్న బాలయ్య, తన కెరీర్ మైల్‌స్టోన్‌గా నిలిచే 50వ చిత్రానికి పూర్తి మాస్ కమర్షియల్ సబ్జెక్టును ఎన్నుకుంటారని భావించిన వారికి, నారీ నారీ నడుమ మురారి వంటి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకోవడం ఒక షాక్‌గా మారింది. యువ చిత్ర బ్యానర్‌పై కాట్రగడ్డ మురారి నిర్మించిన ఈ చిత్రంలో శోభన, నిరోషా హీరోయిన్లుగా నటించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన నారీ నారీ నడుమ మురారి 1990 ఏప్రిల్ 27న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో ఒక కొత్త బాలకృష్ణను ప్రేక్షకులు చూశారు. ఆయన సహజమైన నటన సినిమాకు హైలెట్‌గా నిలిచింది. సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ స్వరపరిచిన ప్రతి పాట హిట్ కావడంతో సినిమా విజయానికి మరింత తోడైంది. అత్త అల్లుళ్ళ టీజింగ్ డ్రామా అనేది బాలకృష్ణకు కొత్తకాకపోయినా, ఈ సినిమా సూపర్ హిట్ కావడానికి ప్రధాన కారణాలు కథ, బాలయ్య నటన.

ఇద్దరు అందాల భామల మధ్య, అత్త రుసరుసల మధ్య ఆహ్లాదంగా సాగే కథకు బాలకృష్ణ అభినయం తోడై ప్రేక్షకులను విశేషంగా అలరించింది. యువ చిత్రాధినేత కాట్రగడ్డ మురారి, సీతారామ కళ్యాణం చిత్రం తర్వాత బాలకృష్ణతో తీసిన మరో సినిమా ఇది. అక్కినేని నాగార్జునతో జానకి రాముడు సినిమా తీసిన తర్వాత బాలకృష్ణతో ఇంకో సినిమా చేయాలని నిర్ణయించుకున్న మురారి, 1988లో జంట రచయితలు శివశక్తి దత్త, విజయేంద్ర ప్రసాద్‌లతో కథా చర్చలు ప్రారంభించారు. వీరు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి శివశక్తి దత్త, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కావడం గమనార్హం. జానకి రాముడు చిత్రానికి కూడా కథ అందించింది వీళ్ళిద్దరే. నారీ నారీ నడుమ మురారి అనే టైటిల్‌ను కూడా శివశక్తి దత్త సూచించారు. అయితే, మధ్యలో ఈ సోదరులకు ఇతర సినిమా ఆఫర్లు రావడంతో, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత దత్తా బ్రదర్స్ ఇచ్చిన మూల కథను తీసుకుని, కాట్రగడ్డ మురారి ఒక ఏడాదిపాటు డి.వి. నరసరాజు, జంధ్యాల, సత్యమూర్తి, భమిడిపాటి రాధాకృష్ణ, తనికెళ్ల భరణి వంటి 11 మంది రచయితలతో చర్చించి స్క్రిప్ట్‌ను ఫైనలైజ్ చేశారు. 1989 మార్చి నెలలో షూటింగ్ మొదలుపెట్టాలని నిర్ణయించుకొని, ముందుగా కేవీ మహదేవన్ సంగీత సారధ్యంలో పాటల రికార్డింగ్‌ను ప్రారంభించారు. ఇంతలో ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందుతున్న బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్ ప్రారంభం కావడంతో బాలకృష్ణ అటువైపు వెళ్ళారు. దీంతో నారీ నారీ నడుమ మురారి షూటింగ్ వాయిదాపడి, చివరికి 8 నెలల తరువాత 1989 డిసెంబర్ 3న ప్రారంభమైంది. బాలకృష్ణ సరసన తొలుత భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ, సీతలను ఎంపిక చేశారు. అయితే, షూటింగ్ వాయిదా పడడంతో హీరోయిన్లు మారిపోయి శోభన, నిరోషా వచ్చారు.

చెన్నైలోని వేలచ్చేరి ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవికి హనీ హౌస్ పేరుతో ఒక పెద్ద గెస్ట్ హౌస్ ఉండేది. దాని పక్కన ఉన్న రెండెకరాల స్థలం కూడా ఆయనదే. ఈ హనీ హౌస్లోనే నారీ నారీ నడుమ మురారి షూటింగ్ మొత్తం జరగడం విశేషం. సినిమాకు నారీ నారీ నడుమ మురారి అనే టైటిల్‌ను తొలుత శివశక్తి దత్త సూచించినా, నిర్మాత కాట్రగడ్డ మురారి మొదట అంగీకరించలేదు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కథతో మొదలైనందున వెంకటేశ్వర మహాత్మ్యం అని పెట్టాలని అనుకున్నారు. కానీ సినిమా ఆలస్యం కావడం, రకరకాల సమస్యల కారణంగా చివరికి నారీ నారీ నడుమ మురారి టైటిల్‌ను ఫైనలైజ్ చేశారు.

ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే, పతాక సన్నివేశం 22 నిమిషాలసేపు హీరో బాలకృష్ణ లేకుండానే ఉంటుంది. ఈ విషయం సినిమా తొలి కాపీ చూసే వరకు బాలకృష్ణకు తెలియదు. సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రకు రచయిత, దర్శకుడు జంధ్యాల డబ్బింగ్ చెప్పడం మరో ప్రత్యేకత. మురారి తీసిన మొదటి సినిమా సీతామహాలక్ష్మికి మాటలు రాసిన జంధ్యాల, ఆయన ఈ చివరి సినిమాకు మాటలు పలకడం కూడా విశేషం. 1990 సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ చిత్రం ప్రాణానికి ప్రాణం ఫ్లాప్ కావడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో, ఏప్రిల్ 27న విడుదలైన నారీ నారీ నడుమ మురారి చిత్రం హిట్టై వారికి ఫుల్ జోష్ ఇచ్చింది. ఈ సినిమా విడుదలైన సరిగ్గా 12 రోజులకు చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి విడుదలైంది. ఆ చిత్రం విజయ ప్రభంజనాన్ని నారీ నారీ నడుమ మురారి సమర్థవంతంగా తట్టుకొని నిలబడి వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర విజయానికి పాటలు కూడా ఒక కారణం. యువ చిత్ర సంస్థ నిర్మించిన అన్ని చిత్రాల్లో మంచి పాటలు ఉంటాయి. కేవీ మహదేవన్ స్వరపరిచిన ఈ సినిమాలోని పాటలు అన్నీ హిట్టే. చిత్రం విడుదలకు ముందే భారీ స్థాయిలో క్యాసెట్లు అమ్ముడై గోల్డ్ డిస్క్ అందుకుంది. 11 మంది రచయితలు 28 నెలల పాటు చర్చలు జరిపి తయారు చేసిన కథ ఇది. ఫైట్స్, బ్రేక్ డ్యాన్సులు లేకుండా తయారైన ఈ సినిమా 45 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.

(ఈ సమాచారం వెటరన్ ఫిల్మ్ జర్నలిస్టుల నుంచి సేకరించాం)

Follow Us