Balakrishna NBK 112: మావయ్య సినిమాకి అల్లుడి క్లాప్.. అమరావతిలో బాలయ్య కొత్త సినిమా ప్రారంభం.. వీడియో
వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ మరో కొత్త సినిమాను ప్రారంభించారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈసారి బాలయ్యను డైరెక్ట్ చేయనున్నారు. గురువారం (జూన్ 25) వెలగపూడిలో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి ఏపీ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారిగా భారీ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. వెలగపూడిలోని బిట్స్ పిలానీ గ్రౌండ్ లో జరిగిన నటసింహం నందమూరి బాలకృష్ణ 112 సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. సినిమా ప్రారంభోత్సవానికి ఎప్పుడూ వెళ్లలేదు. అద్భుత అవకాశం ఇచ్చిన ముద్దుల మావయ్య జై బాలయ్యకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బాలయ్య బాబు నాయకత్వంలో సినీ పరిశ్రమను ప్రజా రాజధాని అమరావతిలో పెద్దఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్దఎత్తున ప్రోత్సహించాలనేది సీఎం చంద్రబాబు గారి ఆలోచన. ఇందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోంది. అమరావతిలో సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది పవిత్ర భూమి. భవిష్యత్ లో మరిన్ని సినిమాలు ఇక్కడి నుంచే ప్రారంభించాలని కోరుకుంటున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, సినీ దర్శకులు కొరటాల శివ, సినీ నిర్మాత చెరుకూరి సుధాకర్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, ఎంఎస్ రాజుతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన ఎన్బీకే 111 టీజర్ కు అభిమానుల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. గతంలో ఇదే కాంబినేషన్ లో వీర సింహారెడ్డి అనే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. కాబట్టి ఈ NBK 111 సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలయ్య NBK 112 గ్రాండ్ లాంఛింగ్.. వీడియో ఇదిగో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




