‘బలగం’ సింగర్ మొగిలయ్య ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సమస్యలకు తోడు గుండె నొప్పి రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు నిమ్స్‌కు తరలించారు. ఇక రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి హరీశ్ రావు మొగిలయ్య ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి ఆదేశాల మేరకు నిమ్స్‌లోని వైద్య నిపుణులు ప్రత్యేక పర్యవేక్షణలో మొగిలయ్యకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నిమ్స్ పాత భవనంలోని ఎఫ్ బ్లాక్ స్పెషల్ రూమ్‌లో బలగం గాయకుడికి డయాలసిస్ సేవలను అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆహారం కూడా తీసుకుంటున్నారని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు. మరోవైపు మొగిలయ్య భార్య కొమురమ్మ మాత్రం ఇంకా ఆందోళన చెందుతూనే ఉంది. తన పనులు తాను చేసుకోలేని దీన పరిస్థితుల్లో తన భర్త ఉన్నారంటూ కన్నీటిపర్యంతమవుతోంది.
‘ మా అయనకు మెరుగైన వైద్యం అందించడానికి సాయపడుతున్న మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావులకు ప్రత్యేక ధన్యవాదాలు. నిమ్స్‌కు వచ్చిన మొగిలయ్య ఆరోగ్యం గురించి మరెంతో మంది పెద్ద సార్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్ నాయకులు, నిర్మాత దిల్ రాజు, బలగం దర్శకులు వేణు ఇంకా ఎంతో మంది ఫోన్లు చేశారు. మా ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు’ అని చెప్పుకొచ్చింది కొమురమ్మ. కాగా బుర్ర కథలు చెప్పి పొట్ట నింపుకునే మొగిలయ్యకు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అలాగే బీపీ, షుగర్ సమస్యలు తలెత్తడంతో కంటి చూపు కూడా మందగించింది. ఇప్పుడు గుండె నొప్పి కూడా రావడంతో వరంగల్ నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..