Salaar Movie : సలార్ హిట్ వెనుక ఆ నలుగురు.. అసలు మ్యాటర్ ఇదేనా..!

|

Dec 25, 2023 | 11:43 AM

భారీ హిట్టు కొట్టాడు అన్న ఆనందం మరోవైపు. అందుకే క్రిస్ మస్, న్యూఇయర్, సంక్రాంతి.. అన్నీ వారికి ఒక్కసారే వచ్చాయి. థియేటర్లు దద్దరిల్లాయి. హిట్టంటే.. అలాంటి ఇలాంటి హిట్టు కాదు.. బాక్సాఫీసులు బద్దలవుతున్నాయి. బ్లాక్ బస్టర్ అంటూ కలెక్షన్ల కనకవర్షం కురుస్తోంది. అందుకే వారికి ఆనందానికి హద్దే లేదు. సలార్ హిట్ వెనుక నలుగురున్నారు. ఆ నలుగురికి సలార్ కు సంబంధం ఏమిటి? ఆ నలుగురు లేకపోతే సలార్ లేడా?

Salaar Movie : సలార్ హిట్ వెనుక ఆ నలుగురు..  అసలు మ్యాటర్ ఇదేనా..!
Salaar
Follow us on

సలార్.. ఈ పేరు పలుకుతున్నప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ కళ్లలో మెరుపు కనిపిస్తుంది. పెదాలపై చిరునవ్వు దర్శనమిస్తుంది. ముఖంలో గర్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మాస్ కే మాస్.. రికార్డులకే బాస్.. షో పడితే ఫుల్ క్యాష్.. అదీ ప్రభాస్. తాము కోరుకున్న క్యారెక్టర్లో.. కావలసిన ఎలిమెంట్స్ తో వాళ్ల కథానాయకుడు వచ్చాడన్న సంతోషం ఓవైపు.. భారీ హిట్టు కొట్టాడు అన్న ఆనందం మరోవైపు. అందుకే క్రిస్ మస్, న్యూఇయర్, సంక్రాంతి.. అన్నీ వారికి ఒక్కసారే వచ్చాయి. థియేటర్లు దద్దరిల్లాయి. హిట్టంటే.. అలాంటి ఇలాంటి హిట్టు కాదు.. బాక్సాఫీసులు బద్దలవుతున్నాయి. బ్లాక్ బస్టర్ అంటూ కలెక్షన్ల కనకవర్షం కురుస్తోంది. అందుకే వారికి ఆనందానికి హద్దే లేదు. సలార్ హిట్ వెనుక నలుగురున్నారు. ఆ నలుగురికి సలార్ కు సంబంధం ఏమిటి? ఆ నలుగురు లేకపోతే సలార్ లేడా?

ఈ నలుగురిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది డార్లింగ్ గురించే. ఎక్కడ మొదలుపెట్టాడు.. ఎక్కడివరకు వచ్చాడు. ప్రభాస్ ఉంటే చాలు.. కథ పరిగెడుతుంది. థియేటర్లు హౌస్ ఫుల్ అయిపోతాయి. థియేటర్లో సినిమా చూసి బయటకు రాగానే.. ఫ్యాన్స్ నోటి నుంచి వచ్చే డైలాగ్ ఒక్కటే. మాస్.. హమారా బాస్.. మా ప్రభాస్! అని. వారి మద్దతు వల్లే సలార్ తో ప్రభాస్.. దిమ్మతిరిగే బొమ్మను అందించగలిగాడు. భారీ హిట్టు కొట్టగలిగాడు. ఆరడుగుల కటౌట్.. అలా నడిచి వస్తుంటేనే ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి. అలాంటిది సలార్ గా సిల్వర్ స్క్రీన్ పై మాస్ లుక్ తో వస్తే ఇక ఆగుతారా? అందుకే షో మీద షో చూస్తూనే ఉన్నారు. రికార్డులు బద్దలు కొట్టారు. ప్రభాస్ యాక్టింగ్, హీరోయిజం.. నెక్స్ట్ లెవల్ అంతే! అనే టాక్ వచ్చేలా చేసుకున్నాడు.

పాన్ ఇండియా బాహుబలి హీరో, కేజీఎఫ్ డైరెక్టర్ కలిసి సినిమా చేస్తున్నారంటే కచ్చితంగా .. ఆ కాంబినేషన్ కు భీకరమైన క్రేజ్ ఉంటుంది. సలార్ విషయంలో అదే జరిగింది. అందుకే డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. నిజంగా ఈ సినిమాకు గట్టి పిల్లర్ అనే చెప్పాలి. కేజీఎఫ్ లో అయితే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ చుట్టూ కథను అల్లుకున్నారు. ఇప్పుడు ఖాన్సార్ సామ్రాజ్యాన్ని కళ్లముందుంచారు. హీరోని ఎలివేట్ చేస్తూనే.. కథలో దమ్ము తగ్గకుండా చూశారు. అందుకే కలెక్షన్లు దుమ్మురేపాయి. పైగా ఇందులో హీరో, విలన్ తో పాటు ఆర్టిస్టుల సెలక్షన్స్.. ప్రత్యేకించి ఆన్ స్క్రీన్ లో కనిపించిన కలర్ టోన్.. ఇవన్నీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. పైగా ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో.. సౌత్ తో పాటు నార్త్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా స్టోరీతోపాటు సీన్స్ ఉండాలి. ప్రశాంత్ నీల్ అక్కడే సక్సెస్ అయ్యాడు. అందుకే నార్తు, సౌతూ అని తేడా లేకుండా.. సప్త సముద్రాల అవతల కూడా సలార్ తో ప్రశాంత్ నీల్ రఫ్పాడించాడు.

ఏ సినిమాకు అయినా స్టోరీయే ప్రాణం. అది బాగుంటేనే బొమ్మ ఆడుతుంది. కలెక్షన్లు వస్తాయి. సలార్ సినిమాకు ఓ రకంగా కథే హీరో. అందుకే ఆ నలుగురిలో స్టోరీ కూడా ఓ పిల్లర్ అనే చెప్పాలి. ఖాన్సార్ అనే కల్పిత సామ్రాజ్యాన్ని సృష్టించి.. అందులో వివిధ పాత్రలను పెట్టి కథంతా అక్కడే నడిపించాడు డైరెక్టర్. కేజీఎఫ్ తో పోలిస్తే.. ఇందులో కూడా హీరో ఎలివేషన్ బాగానే ఉంది. కానీ దాని కంటే.. డ్రామాకు ఇంపార్టెన్స్ ఇవ్వడంతో అది కాస్తా సినిమాకు బూస్ట్ ని ఇచ్చింది. ఇక ప్రభాస్ ఎలా ఉంటే ఫ్యాన్స్ ఇష్టపడతారో అలా ఈ కథ ద్వారా డార్లింగ్ వారి ముందుకు వచ్చాడు. అది కాస్తా క్రేజీగా మారింది. అందుకే ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ ను కూడా స్టోరీ ఆకట్టుకుంది. ఫ్రెండ్ షిప్, పవర్, రివెంజ్ వీటి చుట్టూనే స్టోరీ తిరిగింది. అదే ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అందుకే స్టోరీ కాస్తా సినిమా హిట్ కు ఓ పిల్లర్ గా నిలిచింది.

ప్రభాస్ ఫ్యాన్స్ సైలెంట్ గా ఉంటారు. డీసెంట్ గా కనిపిస్తారు. కానీ రీసెంట్ గా మాత్రం.. రచ్చ రచ్చే. సలార్ ఎప్పుడొస్తాడా అని ఇన్నాళ్లూ ఎదురుచూశారు. కటౌట్ కళ్లముందుకు వచ్చేసరికీ పండగ చేసుకున్నారు. థియేటర్లకు ముస్తాబు చేశారు. అన్నదానాలు ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఒకసారా.. రెండుసార్లా.. ప్రభాస్ కోసం ఎన్ని సార్లయినా తగ్గేదే లే అంటూ వారి బాస్ గర్వపడేలా నడుచుకున్నారు. ఇప్పుడు మరో భారీ హిట్ బాహుబలి ఖాతాలో పడగానే గర్వంతో మీసం మెలేశారు. అన్నొచ్చాడు.. రికార్డులు బద్దలుకొట్టాడు అంటూ పట్టరాని సంతోషంతో ఊగిపోయారు. ఇలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ వల్లే టాలీవుడ్ ధగధగలాడుతోంది. సినీ రంగం కళకళలాడుతోంది. అందుకే తన ఫ్యాన్సంటే ప్రభాస్ కు బోలెడంత ఇష్టం. ఇలా ఈ నలుగురూ సలార్ ను హిట్ సినిమాగా నిలబెట్టారు.

                                                                                                                         (Gunnesh UV, TV9 Executive Editor)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి