
గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న హార్ట్‌వార్మింగ్ ఎమోషనల్ డ్రామా ‘హ్యాపీ జర్నీ’ . అభిరామ్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహిళా భావోద్వేగాలకు ప్రధాన ప్రాధాన్యతనిస్తూ రూపొందుతోంది. బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, తరుణ్ రెడ్డి సహ నిర్మాత . ఏడుగురు మహిళల భావోద్వేగ ప్రయాణాలను ప్రధానంగా చూపించే ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినిషా అలీశెట్టి, రూపా శ్రీనివాస్, సునయన ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, పృధ్వీ దండమూడి, వంశీధర్ గౌడ్, రవి శివతేజ పైలా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతి పాత్రను ఎంతో సహజంగా, భావోద్వేగాలకు దగ్గరగా తీర్చిదిద్దారు. తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ.. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఇందులో నా పాత్ర వుంటుంది. దర్శకుడు నన్ను ఈ పాత్రకు ఎంపిక చేయడం నిజంగా నాకే ఆశ్చర్యంగా అనిపించింది. ఇది చాలా మంచి కథ. మనందరి కథ. మనందరికీ ఎన్నో కథలు, భావోద్వేగాలు ఉంటాయి. అవన్నీ ఈ సినిమా చూసిన తర్వాత మరింతగా అర్థమవుతాయి. ఇది కుటుంబం అంతా కలిసి హాయిగా చూసే సినిమా. ఇంట్లో మన వాళ్లను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నామో చెప్పే నిర్వచనం కూడా ఈ సినిమాలో ఉంది. చాలా మంచి సినిమా. మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఈ పాత్రలో నేను ఎలా చేశానో థియేటర్‌లో చూసి ఆశీర్వదించండి. పారిస్ లో షూటింగ్ చేశాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. నిజంగా ఈ సినిమా నాకు ఒక ‘హ్యాపీ జర్నీ’.
నటి ఆమని మాట్లాడుతూ.. ‘హ్యాపీ జర్నీ’ నిజంగానే ఒక హ్యాపీ జర్నీ. మేమందరం ఫ్రెండ్స్‌లా కలిసి ఈ సినిమా చేశాం. పారిస్ లో షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశాం. ఇది నాకు చాలా కొత్త అనుభవం. ఇంత పెద్ద లాంగ్ ట్రిప్‌లో ఇంతమంది ఆర్టిస్టులతో కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి. ఇలాంటి పాత్రలో నన్ను మీరు ఇప్పటివరకు చూసి ఉండరు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. దర్శకుడు అభిగారు ప్రతి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సినిమాలో నిజమైన హీరో, హీరోయిన్ అన్నపూర్ణమ్మ గారే. పారిస్ షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను. ఝాన్సీ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు. ప్రతి విషయంలో ఆమె ఎంతో సహాయం చేశారు.
నటి ఝాన్సీ మాట్లాడుతూ.. మంచి సినిమా అయితే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఎన్నోసార్లు నిరూపించారు. ‘హ్యాపీ జర్నీ’ కూడా అలాంటి మంచి సినిమా. ఏడుగురు మహిళలు ఒక ప్రయాణంలో కలిస్తే ఎంత సరదాగా ఉంటుందో, వారి మధ్య ఏర్పడే బంధం, భావోద్వేగాలు, కన్నీళ్లు ఎంత హృదయాన్ని తాకుతాయో ఈ సినిమా చూపిస్తుంది. ఇది చాలా డిఫరెంట్ కథ. తెలుగు ప్రేక్షకులు మరోసారి ఇలాంటి సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నాను. అభి చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఒక ప్రయాణం ఆధారంగా సినిమా ఎంత అందంగా ఉండొచ్చో ఇందులో చూపించాడు. పారిస్‌కు దగ్గరలో ఉన్న ఒక నగరంలో ఈ సినిమాను షూట్ చేశాం. ఇందులో ప్రతి పాత్రను చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇప్పటివరకు చూడని అన్నపూర్ణమ్మ గారిని ఇందులో చూస్తారు. ఆమె మీ మనసును దోచేస్తారు. మేమందరం చాలా ఫ్రెండ్లీగా ఈ సినిమా చేశాం. త్వరలోనే ఈ సినిమా మీ ముందుకు రాబోతోంది. తప్పకుండా మీ అందరికీ ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి