శంకర్.. ఈ పేరు ఒకప్పుడు బ్రాండ్. ఈయన నుంచి సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ అంతా ఆసక్తిగా వేచి చూసేవాళ్లు. కానీ కొన్నేళ్లుగా ఈయన స్థాయి సినిమా ఒక్కటి కూడా రాలేదు. రోబో తర్వాత శంకర్ చేసిన నమ్బన్ రీమేక్.. విక్రమ్ హీరోగా తెరకెక్కించిన ఐ తెలుగులో ఫ్లాప్.. తమిళంలో మాత్రం కమర్షియల్‌గా సేఫ్ అయింది. ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన 2.0 అంతగా ఆడలేదు. ఇక గతేడాది విడుదలైన ఇండియన్ 2 గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తాజాగా విడుదలైన గేమ్ ఛేంజర్ సినిమాతో వచ్చాడు ఈ దర్శకుడు. ఈ సినిమా ఫలితంపైనే శంకర్ కెరీర్ ఆధారపడి ఉంది. ఈ మధ్య ఎక్కువగా విఎఫ్ఎక్స్ సినిమాలు చేసిన శంకర్.. చాలా ఏళ్ళ తర్వాత పొలిటికల్ సినిమా చేసారు.
గేమ్ ఛేంజర్ తర్వాత ఇండియన్ 3 కూడా లైన్‌లోనే ఉంది. గేమ్ ఛేంజర్ హిట్టైతే ఇండియన్ 3కి మళ్లీ ఊపొస్తుంది. అదే జరగాలని కోరుకుంటున్నారు శంకర్ కూడా. ఇండియన్ 2 డిజాస్టర్ కావడంతో.. పార్ట్ 3పై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. దీని తర్వాత ప్రాజెక్ట్‌కు ఇప్పట్నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు శంకర్. వీరయుగ నాయగన్ వేల్పరి అనే పుస్తకం ఆధారంగా 3 భాగాలతో శంకర్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు.
నిజానికి వీరయుగ నాయగన్ వేల్పరి అనేది శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాను శంకర్ కూడా కన్ఫర్మ్ చేసారు. గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్‌లో సాయం చేసిన మధురై ఎంపి వెంకటేశన్ రాసిన నవలలో వేల్పరి నేపథ్యం ఉంది. దీన్ని కూడా తన సినిమా కోసం వాడుకోబోతున్నారు శంకర్. గేమ్ ఛేంజర్, ఇండియన్ 3 ఆడితే.. శంకర్ నుంచి ఈ 3 పార్ట్స్ సినిమా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వేల్పరి ప్రాజెక్ట్‌ను ఇండియన్ సినిమాలో ఉన్న సూపర్ స్టార్స్‌తో ప్లాన్ చేస్తున్నాడు. మరి ఇది జరుగుతుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.