సినిమానే జీవితంగా భావించి.. సినిమా కోసమే సర్వస్వం అర్పించే వాళ్లను చూస్తే బహు ముచ్చటేస్తుంది. వాళ్లకు, వాళ్ళ కష్టానికి, కమిట్మెంట్ కు టేక్ ఏ బౌ అనాలని ఎవ్వరికైనా అనిపిస్తుంది. వాళ్లకు సక్సెస్ ఇవ్వాలని దేవుళ్ళకు రికమెండ్ చేస్తాం కూడా. కానీ.. ఆ సినిమా కోసం సొంత క్యారెక్టర్లనే పణంగా పెట్టడమంటే… అలా పెట్టేవాళ్ళంటే ఏమనిపిస్తుంది. అదొక అనిర్వచనీయమైన అనుభూతి కదా! లేటెస్ట్ గా టాలీవుడ్ లో అటువంటి పోకడే ఎక్కువగా కనిపిస్తోంది. సెల్ఫ్ క్యారెక్టర్ అసాసినేషన్…! సొంత వ్యక్తిత్వాల్ని బలిపీఠం ఎక్కించండం..! పబ్లిసిటీ పిచ్చితో ఎలాగైనా లైమ్ లైట్ లో ఉండాలన్న అత్యాశతో రామ్ గోపాల్ వర్మ, బండ్ల గణేష్ లాంటి వాళ్ళు హద్దులు దాటి ప్రవర్తించడం చూసిచూసి అలసిపోయాడు తెలుగు ప్రేక్షకుడు. అయినా ‘నేనింతే’ అని వాళ్ళకు వాళ్ళే సర్టిఫై చేసుకున్నప్పుడు మనమెవ్వరం నిలదియ్యడానికి.? మితిమీరిన ఆత్మవిశ్వాసం వాళ్ళను ఆ దిక్కుకు నడిపిస్తోంది అని లైట్ తీసుకోవడం మనకూ అలవాటైపోయింది.
తాజాగా.. సినిమాల పబ్లిసిటీ కోసం ఇటువంటి విచిత్రమైన పోకడనే నెత్తికెత్తుకుని… కాసింత అభాసుపాలయ్యారు నటుడు-దర్శకుడు అవసరాల శ్రీనివాస్. బట్టతల-దాంతో బలైపోతున్న జీవితాలు అనే కాసెప్ట్ తో సినిమా చేసిన అవసరాల.. దాని ప్రచారం కోసం ఒక ప్రాంక్ చేశారు. తనకూ- తన అసిస్టెంట్ కీ మధ్య గొడవ జరిగినట్టు… చిత్రీకరించిన ఆ వీడియోలో తన ‘తల’నే ఎరగా వాడుకున్నారు. తన యాక్టింగ్ అండ్ డైరెక్టోరియల్ టాలెంట్ తో తనకంటూ సెపరేట్ అభిమాన గణాన్ని కలిగివున్న అవసరాల.. ఈ ప్రాంక్ ద్వారా… వాళ్ళ నుంచే విమర్శల్ని ఎదుర్కొన్నారు. మరో అప్కమింగ్ మూవీ… మళ్ళీ మొదలైంది. రీమ్యారేజ్ కాన్సెప్ట్ తో చేస్తున్న ఈ మూవీలో సుమంత్ హీరో. సినిమా పబ్లిసిటీకి కిక్ స్టార్ట్ ఇవ్వాలన్న ప్లాన్ తో.. మూవీ ఫస్ట్ పోస్టర్ ని పెళ్లి పత్రికగా మలిచి సైలెంట్ గా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. సుమంత్ కుమార్ వెడ్స్ పవిత్ర అనే అక్షరాలున్న ఈ పత్రిక… సుమంత్ పర్సనల్ లైఫ్ నీ, అతడి మారిటల్ రిలేషన్స్ నీ టచ్ చేసింది. గతంలో కీర్తి రెడ్డితో పెళ్లయి విడాకులు తీసుకున్న సుమంత్… ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు అనే వార్తలకు ఆస్కారం ఇచ్చారు మేకర్స్. ‘పెళ్లి పేరుతో మళ్ళీ మోసపోతున్నావా’ అంటూ రామ్ గోపాల్ వర్మ కూడా ట్విట్టర్లో గడ్డి పెట్టడంతో సుమంత్ వ్యక్తిగత జీవితం దాదాపు ‘బజార్న’ పడింది.
ఒక్కమాటలో చెప్పాలంటే… ఇవన్నీ ఆయాచితంగా జరిగే ‘ఆత్మహత్యా సదృశాలు’. ఇటువంటి ప్రాంక్స్ ద్వారా సదరు సినిమాలకు ఎంత పబ్లిసిటీ వస్తుందో గానీ… దీంతో జరిగే ‘సెల్ఫ్ క్యారెక్టర్ అసాసినేషన్’ మాత్రం ఇర్రిపేరబుల్. ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేసి తమతమ సినిమాల్ని జోరుగా జనంలోకి తీసుకెళ్లవచ్చన్న స్ట్రాటజీ చాలా పాతది కూడా. గతంలో చాలామంది చేసి వదిలేసిన ఈ ఫార్ములాల్ని మళ్ళీ గుర్తుచేసినంత మాత్రాన… చిన్న సినిమాలు పెద్ద సినిమాలైపోతాయా..? ఒకవేళ అయితే మంచిదే మరి.
– రాజా శ్రీహరి, TV9, ET డెస్క్
మరిన్ని ఇక్కడ చదవండి :
కృష్ణాష్టమి రోజున సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రాధేశ్యామ్ యూనిట్.. అపురూప ప్రేమ కథకు సాక్ష్యం ఈ ఫొటో.