దేశవ్యాప్తంగా ఇప్పటికే ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు సంబంధించిన వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. తాజాగా మరో తమిళ సినిమాపై వివాదం రాజుకుంది. తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఐశ్వర్య రాజేష్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఫర్హానా’. నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని డైలాగ్స్, సీన్లు ముస్లిం మహిళలను, హిజాబ్‌ను అవమానించేలా ఉన్నాయని కొన్ని ఇస్లామిక్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ముస్లింలను కించ పరిచేలా ఉన్న సినిమాపై నిషేధం విధించాలని కూడా కొన్ని ముస్లిం సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై జమాత్ సంస్థ ఇప్పటికే చెన్నై పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించారు. ఈ చిత్రం ఈరోజే (మే12) విడుదలవుతోంది. మరోవైపు ఐశ్వర్యా రాజేష్ ‘ఫర్హానా’ చిత్ర వివాదంపై డ్రీమ్ వారియర్ పిక్చర్స్ స్పందించింది. తమ చిత్రం ఏ మతానికి, ఎవరి భావోద్వేగాలకు వ్యతిరేకం కాదని చెప్పింది. ప్రజలను ఆలోచింపజేసేలా సామాజిక బాధ్యతను, విలువలను గుర్తు చేసేలా చేయడం తమ ఉద్దేశం అని, తమ సినిమాలు మత సామరస్యం, సామాజిక సమన్వయం, ప్రేమ గురించి మాట్లాడేలా ఉంటాయని చెప్పుకొచ్చింది.
సెన్సార్ బోర్డు సెన్సార్ చేసిన తర్వాత కూడా ఫర్హానాపై కొంత మంది వివాదం సృష్టించడం తీవ్రంగా బాధించిందని, అయితే తమ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని వందలాది మంది కష్టంతో తెరకెక్కించిన ఫర్హానా చిత్రాన్ని తమిళ ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ చెప్పింది. ఫర్హానా సినిమాలో ఐశ్వర్య రాజేష్‌తో పాటు కె. సెల్వరాఘవన్, అనుమోల్ మనోహరన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు సమకూర్చారు.
A Kind note to everyone from team #Farhana pic.twitter.com/mXb6lj6qIm
— DreamWarriorPictures (@DreamWarriorpic) May 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..