
ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి రామేశ్వరి. ఇటీవలే ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలోనూ నటించి మెప్పించారు నటి రామేశ్వరి. అలాగే గతంలో మహేష్ బాబు హీరోగా నటించిన నిజం సినిమాలో ఆమె హీరో తల్లిగా కనిపించి మెప్పించారు. గతంలో రామేశ్వరి ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహేష్ బాబు నటించిన నిజం సినిమాతో తన ప్రయాణాన్ని గురించి ఎన్నో జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్ర కోసం దర్శకుడు తేజ ముందుగా చాలా మంది ప్రముఖ నటీమణులను సంప్రదించినట్లు రామేశ్వరి తెలిపారు. హిందీ నటి రేఖ, జయసుధ లాంటివారిని ఆ పాత్రను నిరాకరించారని, జయసుధ గారు మోటార్ సైకిల్ ఎక్కడం వంటి సన్నివేశాల కారణంగా నిరాకరించారని ఆమె తెలిపారు. ఆ తర్వాత తేజ హఠాత్తుగా తనను సంప్రదించారని, ముంబై నుండి హైదరాబాద్ వచ్చి కథ వినమని అడిగారని రామేశ్వరి చెప్పారు.
పాత్ర చాలా మంచిదని, మహేష్ బాబు తల్లిగా నటించాల్సి ఉంటుందని తేజ క్లుప్తంగా వివరించారని ఆమె పేర్కొన్నారు. కథ విన్న తర్వాత, లుక్ టెస్ట్ కోసం తెల్ల చీరతో గెటప్ వేసుకుని ఫోటోలు తీసుకున్నట్లు రామేశ్వరి తెలిపారు. పారితోషికం విషయంలో తనకు అప్పట్లో పెద్దగా అవగాహన లేదని, వాళ్లు ఎంత ఇస్తే అంత తీసుకున్నా అని తెలిపారు. అయితే, షూటింగ్ విషయంలో మాత్రం ఒక షరతు పెట్టానని, తన చిన్న కొడుకు పరీక్షల కారణంగా మార్చిలో షూటింగ్‌కు హాజరు కాలేనని, ఫిబ్రవరిలోగా చిత్రీకరణ పూర్తి చేయాలని చెప్పానని గుర్తు చేసుకున్నారు. తేజ 20-25 రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా, అది జరగలేదని, తన కొడుకు పరీక్షల సమయంలో ప్రతి రెండో రోజు షూటింగ్ ఉండేదని రామేశ్వరి తెలిపారు. ఉదయం వచ్చి సీన్లు చేసి, రాత్రికి ఇంటికి తిరిగి వెళ్లేదాన్నని ఆమె తెలిపారు.
మహేష్ బాబుతో తన సంబంధం గురించి మాట్లాడుతూ.. సెట్స్‌లో మహేష్ బాబు, తేజ తన నటన విధానాన్ని, ముఖ్యంగా డైలాగులను పదిసార్లు ప్రాక్టీస్ చేయడాన్ని చూసి సరదాగా ఆటపట్టించేవారని ఆమె అన్నారు. సినిమాలో ఓ సన్నివేశంలో మహేష్ బాబు ఆటోలో వెళ్తూ “అమ్మా, జాగ్రత్తగా వెళ్లు” అని చెప్పే సన్నివేశంలో ఎంతో ఎమోషనల్ అయ్యారని, ఆయన పాత్రలోకి పూర్తిగా లీనమయ్యారని ఆమె ప్రశంసించారు. అయితే, షూటింగ్ చివరి దశలో బైక్ షాట్స్ ఎక్కువగా చేస్తుండటంతో మహేష్ బాబు బోర్ కొట్టిందని సరదాగా అన్నారు. బైక్ షాట్స్ సమయంలో ఒకటి రెండు సార్లు కింద పడ్డానని వెల్లడించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..