అక్కినేని నాగచైతన్య నటించిన జోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ కార్తీక నాయర్. తొలి సినిమాతోనే నటనతో ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు అడియన్స్ హృదయాల్లో తనకంటూ ప్రత్యేకమైన చోటు సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత కొన్ని చిత్రాల్లో కనిపించిన కార్తీక.. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే ఈ బ్యూటీ పెళ్లీ పీటలెక్కనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం నిశ్చితార్థం జరిగినట్లు తెలిపిన కార్తీక.. తనకు కాబోయే వరుడి ఫోటోస్ మాత్రం రివీల్ చేయలేదు. ఇప్పుడు ఎట్టకేలకు తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ముఖాన్ని చూపించింది. అటు సీనియర్ హీరోయిన్ రాధా నాయర్ సైతం తన కూతురి నిశ్చితార్థం విషయాన్ని షేర్ చేసింది తప్పా.. కాబోయే అల్లుడు ఎవరనేది వెల్లడించలేదు. ఇక ఇప్పుడు కార్తీక తనకు కాబోయే భర్త ఫోటోస్ రివీల్ చేసింది.
రోహిత్ మీనన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు కార్తీక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. వారిద్దరి నిశ్చితార్థంకు సంబంధించిన కొన్ని ఫోటోస్ ఆమె తన ఇన్ స్టా వేదికగా షేర్ చేసుకుంది. అయితే కార్తీకకు కాబోయే భర్త రోహిత్ ఎవరనే విషయంపై ఎలాంటి సమాచారం వెలువడలేదు. రోహిత్ ఇన్‌స్టాగ్రామ్ పేజీని కార్తీక షేర్ చేసింది కానీ ఆ ఖాతా ప్రైవేట్‌గా ఉంది.
“నిన్ను కలవడం విధి.. నిన్ను ఇష్టపడడం ఒక మ్యాజిక్.. మన జీవన ప్రయాణం మొదలుపెట్టడానికి కౌంట్ డౌన్ ప్రారంభించాను” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది కార్తీక. కార్తీక షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. జోష్ సినిమాతో పరిచయమై.. రంగం సినిమాతో పాపులారిటీని సొంతం చేసుకుంది కార్తీక. ఆ తర్వాత తారక్ నటించిన దమ్ము సినిమాలో మెరిసింది. ఆ తర్వాత అల్లరి నరేష్ నటించిన బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాలో నరేష్ చెల్లిగా నటించింది. అందం, అభినయం ఉన్నప్పటికీ కార్తీకకు అదృష్టం కలిసిరాలేదు. తెలుగు ఇండస్ట్రీలో కార్తీకకు అనుకున్నంతగా అవకాశాలు రాకపోవడంతో.. 2015 తర్వాత కార్తీక మరో సినిమాలో కనిపించలేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.