
మహేశ్ ఆచంట అలియాస్ రంగ స్థలం మహేశ్ శుభవార్త చెప్పాడు. త్వరలో తాను రెండోసారి తండ్రిగా ప్రమోషన్ పొందనున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం అతని భార్య పావని నిండు గర్భంతో ఉంది. ఈ సందర్భంగా భార్య మెటర్నటీ ఫొటో షూట్‌లో దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు మహేష్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మహేష్ – పావని దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన మహేశ్.. తన సమీప బంధువులమ్మాయి అయిన పావనిని వివాహం చేసుకున్నాడు. 2020 కరోనా లాక్ డౌన్ కాలంలో వీరి పెళ్లి జరిగింది. ఇప్పటికే ఈ దంపతులకు ఓ కూతురు. ఇప్పుడు రెండోసారి అమ్మనాన్నలు కానున్నారీ క్యూట్ కపుల్. దీంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
జబర్దస్త్ షో ద్వారా కమెడియన్‌గా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మహేశ్ ఆచంట. ఆ తర్వాత రంగ స్థలం సినిమాతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీని తర్వాతనే మహేష్ కాస్తా.. రంగస్థలం మహేష్ గా మారిపోయాడు. చాలా సినిమాల్లో కామెడీతో నవ్వించిన మహేష్.. కొన్ని సినిమాల్లో ఎమోషనల్ సీన్స్‌లో నటించి ఏడిపించాడు కూడా. ఇక మహానటి తదితర సినిమాల్లో నెగెటివ్ రోల్స్ తోనూ ఆకట్టుకున్నాడు. యాత్ర, మహర్షి, గుణ 369, రాజాది గ్రేట్, శతమానం భవతి, సినిమా చూపిస్త మావా, ఖైదీ నంబర్ 150, కాటమ రాయుడు, రారండోయ్ వేడుక చూద్దాం, డిస్కో రాజా, జాతిరత్నాలు, గుంటూరుకారం, విరూపాక్ష, సీతారామం, రజాకార్, డెవిల్, కొండ పొలం, మ్యాస్ట్రో, ప్రతి రోజూ పండగే, తండేల్ తదితర సినిమాలు మహేష్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
ప్రస్తుతం పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ది రాజా సాబ్ మూవీలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడు మహేష్. దీంతో పాటు పలు క్రేజీ సినిమాలు ఈ కమెడియన్ చేతిలో ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..