Ponnambalam: నాలుగేళ్లలో 750 ఇంజెక్షన్లు.. దయచేసి నాలాగా మీరు ఆ తప్పులు చేయద్దు.. పొన్నాంబళం ఆవేదన

సుమారు 1500కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన పొన్నాంబళం ఇటీవలే మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో కూడా చికిత్స తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న ఆయన తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Ponnambalam: నాలుగేళ్లలో 750 ఇంజెక్షన్లు.. దయచేసి నాలాగా మీరు ఆ తప్పులు చేయద్దు.. పొన్నాంబళం ఆవేదన
Actor Ponnambalam

Updated on: Jul 27, 2025 | 1:34 PM

1980-90వ దశకంలో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో పవర్ ఫుల్ విలన్ గా ఓ వెలుగు వెలిగారు పొన్నాంబళం. స్టంట్‌మ్యాన్‌గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన విలన్ గా మారారు. తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లో సుమారు 1500 వందలకు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌, పవన్‌ కల్యాణ్‌ వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో విలన్‌ పాత్రలతో మెప్పించారు పొన్నాంబళం. ఇక తమిళంలో అయితే రజనీకాంత్‌ , కమలహాసన్‌, శరత్‌ కుమార్‌, విజయ్‌, అజిత్‌ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు పొన్నాంబళం. తీవ్ర ఆర్థిక సమస్యలకు తోడు కొన్నేళ్ల క్రితం మూత్ర పిండాల వ్యాధి బారిన పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి నటుడికి రూ. 50 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. ఇటీవలే మళ్లీ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన పొన్నాంబళం క్రమంగా కోలుకుంటున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన పొన్నాంబళం తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ నాలుగేళ్లలో 750కి పైగా ఇంజెక్షన్లు చేయించుకున్నాను. రెండు రోజులకు ఒకసారి రెండు ఇంజక్షన్లు చేసి నా ఒంటిలోని రక్తాన్ని తీసి డయాలసిస్‌ చేశారు. నాకు వచ్చిన ఈ పరిస్థితి పగ వాడికి కూడా రాకూడదు. ఎక్కువగా మద్యం సేవించడం వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. అయితే చాలా ఏళ్ల క్రితమే మద్యం తీసుకోవడం మానేశాను. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మూత్రపిండాల సమస్య కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్నాను. ఆ సమయంలో చాలా బాధ అనుభవించాను. మద్యం ఎప్పటికైనా హనికరమే. జీవితంలో నేను చేసిన తప్పు మీరెవరూ చేయవద్దు’ అని అభ్యర్థించారు పొన్నాంబళం.

కాగా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉన్నాడు పొన్నాంబళం. ఆయన చివరిగా 2019లో ఓ సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత అనారోగ్య సమస్యలతో కేవలం ఇంటికే పరిమితమయ్యాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి